ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ సన్నద్ధత సిరీస్‌లో భారత జట్టును ఓడించి జోరు మీదుంది ఆస్ట్రేలియా (Australia). మరోసారి టైటిల్ కొల్లగొట్టాలని వ్యూహాలు పన్నుతున్న ఆ జట్టుకు అనుకోకుండా భారీ షాక్ తగిలింది. ప్రపంచ కప్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుందనగా ఆల్‌రౌండర్ గ్రేస్ హ్యారిస్ (Grace Harris) టోర్నీకి దూరమైంది. వరల్డ్ కప్ ఆడాలని ఎన్నో కలలు కన్న ఆమెను గాయం రూపంలో దురదృష్టం వెంటాడింది. దాంతో.. నిరాశగా స్వదేశం బయల్దేరనుంది హ్యారిస్. ఈ స్టార్ ఆల్‌రౌండర్ స్థానంలో హీథర్ గ్రాహం (Heather Graham)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ వెల్లడించింది.
ప్రపంచ కప్ సన్నాహకంగా భారత జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో హ్యారిస్ ఒకేఒక మ్యాచ్ ఆడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేకు ముందు తొడ కండరాల నొప్పితో అనాబెల్ సథర్లాండ్ ఇబ్బందిపడింది. దాంతో హ్యారిస్‌కు ఛాన్స్ వచ్చింది. కానీ.. ఫీల్డింగ్ చేస్తుండగా ఆమె గాయపడింది.
Devastating news for Grace Harris 😢
Full story: https://t.co/KHnu0pN9DF #CWC25 pic.twitter.com/Xp50Zxa9y8
— Australian Women’s Cricket Team 🏏 (@AusWomenCricket) September 23, 2025
సో.. వరల్డ్ కప్ ఆడాలనే కల నెరవేరకుండానే హ్యారిస్ ఇంటిముఖం పట్టనుంది. 2019 తర్వాత మొదటిసారిగా వరల్డ్ కప్ ముందు మ్యాచ్ ఆడిన ఆమె.. ఈ మెగా టోర్నీలో చెలరేగిపోవాలని భావించింది. అయితే.. గాయం వెంటాడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : అలీసా హేలీ(కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్(వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, అషే గార్డ్నర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, అలనా కింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, సోఫీ మొలినెక్స్, బేత్ మూనీ, ఎలీసా పెర్రీ, మేగన్ షట్, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వొల్, జార్జియా వరేహమ్.
ప్రపంచ కప్‌లో అధిపత్యం చెలాయించే ఆసీస్ ఈసారి కూడా మెగా టోర్నీకి పక్కా ప్లాన్‌తో వస్తోంది. టాపార్డర్‌లో దంచికొట్టేందుకు అలీసా హేలీ, డార్సీ బ్రౌన్, ఫొబే లిచ్‌ఫీల్డ్ ఉన్నారు. తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వరేహం, ఎలీసా పెర్రీ, అషే గార్డ్నర్ ఆల్రౌండర్లుగా ఇరగదీయడం ఖాయం. మేఘన్ షట్, సథర్లాండ్, జార్జియా వొల్తో కూడిన పేస్ దళం కూడా పటిష్టంగానే ఉంది.