న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీ(Auqib Nabi) .. దేశవాళీ క్రికెట్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఈ రికార్డును నెలకొల్పాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో 28 ఏళ్ల బౌలర్ తన పేస్‌తో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ 53వ ఓవర్లో వరుసగా విరాట్ సింగ్, మానిషి, ముక్తార్ హుసేన్ వికెట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో తొలి బంతికే సూరజ్ సింధూ జైస్వాల్ వికెట్‌ను తీసుకున్నాడతను.
దులీప్ ట్రోఫీ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన బౌలర్లలో కపిల్ దేవ్ ఫస్ట్ ఉన్నారు. 1978లో నార్త్ జోన్ వర్సెస్ వెస్ట్ జోన్ మ్యాచ్‌లో కపిల్ హ్యాట్రిక్ తీశాడు. ఆ తర్వాత 2001లో వెస్ట్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్ మ్యాచ్‌లో సాయి రాజ్ బహుతులే హ్యాట్రిక్ తీశాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో నబీ 10.1 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
బౌలర్ నబీ 2020లో జమ్మూకశ్మీర్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది క్వార్టర్స్‌లో కర్నాటకపై మూడు వికెట్లు తీసుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయలేదు. ఆ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీసుకున్నాడు. 18.50 యావరేజ్‌తో రెండు సార్లు అయిదేసి వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు అతను క్రికెట్ ఆడలేదు. మళ్లీ గత సీజన్లో రంజీ ట్రోఫీ మ్యాచుల్లో చెలరేగాడు. 9 మ్యాచుల్లో 13 సగటుతో అతను 49 వికెట్లు తీసుకున్నాడు.