లాస్‌వేగాస్: ప్రతిష్టాత్మక ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్‌కు చుక్కెదురైంది. టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి కొత్త చరిత్ర లిఖించిన అర్జున్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో అర్జున్ 0-2 తేడాతో అమెరికా జీఎం లెవాన్ అరోనియన్ చేతిలో ఓడాడు. ప్రిలిమ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్తో పాటు క్వార్టర్స్‌లో హికారు నకామురను చిత్తు చేసి జోరు మీద కనిపించిన అర్జున్..సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన ఈ తెలంగాణ కుర్రాడు..ప్రత్యర్థికి అవకాశం కల్పించాడు. కీలక సమయంలో వేసిన ఎత్తు అర్జున్ ఓటమికి కారణమైంది. మరో సెమీస్‌లో హన్స్ మోక్ నీమన్ 2.5-1.5తో ఫాబియనో కరునాపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు వర్గీకరణ పోరులో ప్రజ్ఞానంద 1.5-0.5తో విన్సెంట్ కీమర్‌పై గెలిచాడు.