ఉత్కంఠతో నరాలు తెగడం అంటే ఏంటో.. రసవత్తర పోరుతో రక్తం మరగడం అంటే ఏలా ఉంటుందో.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చూసిన వారికి సరిగ్గా తెలిసి ఉంటుంది. యావత్ క్రీడాలోకాన్ని మునివేళ్లపై నిలబెడుతూ.. మైదానంలోని అభిమానులను ఆటగాళ్లుగా చేస్తూ.. దేశాధినేతనలును సైతం చిన్నపిల్లల్లా మారుస్తూ.. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది.
తొలి ఎనభై నిమిషాల్లో రెండు గోల్స్‌తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన అర్జెంటీనా.. ఏకపక్షంగా మ్యాచ్ గెలుచుకోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే.. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌తో మైదానాన్ని హోరెత్తించాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో రెండు గోల్స్ కొట్టడంతో స్కోర్లు సమం కాగా.. ఎక్స్ట్రా టైమ్‌లో మరోసారి మెస్సీ మాయ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో.. ఆట చివరి క్షణాల్లో ఎంబాపే మరో గోల్‌తో మ్యాచ్‌ను పెనాల్టీ షూటౌట్‌కు తీసుకెళ్లాడు.
సుమారు లక్ష మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో గుండె చప్పుడు కూడా రణనినాదమై మారుమోగుతున్న సమయంలో.. ఆటగాళ్ల నరాల స్థానంలో ఉక్కు తీగలున్నా ఒత్తిడిలో తెగిపోయేంతటి ఉత్కంఠతో సాగిన షూటౌట్లో అర్జెంటీనా అదరగొట్టింది. ఫుట్‌బాల్ మాంత్రికుడు డిగో మారడోనాకు ఘన నివాళి అర్పించడంతో పాటు.. స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీకి ప్రపంచకప్ కానుకగా ఇవ్వాలనుకున్న అర్జెంటీనా కల సాకారమైంది. ఎట్టకేలకు 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనా మూడోసారి ప్రపంచకప్ చేజిక్కించుకుంది.
దోహా: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా.. ఫిఫా ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన సాకర్ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) కెరీర్ చివరి మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతో రెండు గోల్స్ కొడితే.. ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌కు పరిమితం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. అందులోనూ ముందంజలో నిలిచిన అర్జెంటీనా గోల్ కొట్టడంతో ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఎంబాపే అద్వితీయ రీతిలో గోల్ నమోదు చేయడంతో మరోసారి 3-3తో స్కోర్లు సమమ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా.. అందులో అర్జెంటీనా ముందంజ వేసింది.
ఫిఫా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రపంచకప్‌గా చరిత్రకెక్కిన ఖతార్ మెగాటోర్నీ ఏర్పాట్లలోనూ భళా అనిపించుకుంది. ఆదివారం ముగింపు వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ప్రత్యేక ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకోగా.. దోహాలోని లుసైల్ స్టేడియంలో కండ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా మెరుపులతో కాంతులీనింది. అంతకుముందు స్పానిష్ మాజీ ఆటగాడు కాసిల్లస్తో కలిసి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ ప్రపంచకప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చింది.
మెస్సీ మ్యాజిక్..
సాకర్ విశ్వసమరంలో విజేతగా నిలిచిన అర్జెంటీనాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యుత్తమ సమరమని అభివర్ణించారు. తుది సమరం ఇంత ఉత్కంఠగా జరుగుతుందనుకోలేదని.. ఇరు జట్లు శయశక్తులా పోరాడాయని కొనియాడారు. అన్నీ తానై జట్టును గెలిపించిన కెప్టెన్ లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. గోల్డెన్ బూట్ సాధించిన ఎంబాపే ఫైనల్లో హ్యాట్రిక్‌తో అదరగొట్టాడని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే (8) నిలిచాడు. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ (7) రెండో స్థానంలో ఉన్నాడు.
56 ఏండ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా ఎంబాపే చరిత్రకెక్కాడు.
అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ టైటిల్. గతంలో 1978, 1986లో కప్పు కొట్టింది.
మెస్సీ కల నెరవేరే
రెప్ప పాటులో ప్రత్యర్థిని ఏమార్చి బంతిని ఆధీనంలోకి తెచ్చుకునే మంత్రగాడు..మైదానంలో పాదరసాన్ని తలపిస్తూ అభిమానులను వశం చేసుకునే ఇంద్రజాలికుడు..కండ్లు చెదిరే ఫీల్డ్ గోల్స్‌తో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఘనుడు..పెనాల్టీల్లో అడ్డుగోడలను ఛేదిస్తూ మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపే ధీరుడు.. యావత్ క్రీడాలోకాన్ని తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
మాటల్లో సౌమ్యుడిగా.. చేతల్లో ఘనాపాటిగా గుర్తింపు సాధించిన మెస్సీ 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించి సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. పిట్ట కొంచం కూత ఘనంలా.. ఉద్దండపిండాలతోనే శభాష్ అనిపించుకున్న ఈ 35 ఏండ్ల అర్జెంటీనా యోధుడు.. కెరీర్లో లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట రాసుకున్నాడు. రికార్డు స్థాయిలో ఆరుసార్లు బాలన్ ‘డి’ ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ.. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేశాడు. తమ దేశ దిగ్గజం మారడోనాకు నివాళిగా ప్రపంచకప్ సాధిస్తామని టోర్నీకి ముందే మాటిచ్చిన మెస్సీ.. అందుకు తగ్గట్లే సారథిగా దేశానికి మూడో కప్పు అందించాడు. కెరీర్ ఆరంభంలోనే మరో మారడోనాగా గుర్తింపు సాధించిన మెస్సీ.. ఆటతోనే కాకుండా తన వ్యవహార శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే మెస్సీ.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు ఎదుర్కొన్నాడు. 2014లో ఒంటిచేత్తో జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన మెస్సీ.. దేశానికి కప్పు అందించలేకపోయినా.. తన అసమాన ప్రతిభతో గోల్డెన్ బూట్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రాటుదేలిన మెస్సీ.. తాజా మెగాటోర్నీలో నాయకుడిగా స్ట్రయికర్‌గా జట్టును ముందుండి నడిపించాడు.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా వెనుదిరిగి చూసుకోలేదంటే అందుకు ప్రధాన కారణం మెస్సీ పోరాట పటిమే. తొలి మ్యాచ్‌లోనే ఓడటం తమకు మంచే చేస్తుందని.. సహచరుల్లో స్ఫూర్తి నింపిన మెస్సీ.. అద్వితీయమైన గోల్స్‌తో నాయకుడిగా జట్టును గెలిపించాడు. గ్రూప్ దశలో మెక్సీకో, పోలాండ్‌పై నెగ్గిన అర్జెంటీనా.. ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై, క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై, సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయాలు సాధించింది. తాజా మెగాటోర్నీలో 7 గోల్స్ కొట్టిన మెస్సీ.. మరో నాలుగు గోల్స్‌కు సహాయకారిగా ఉపకరించాడు. గత ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో తమను ఓడించిన ఫ్రాన్స్‌పై ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనాకు.. తుదిపోరులో మెస్సీ అదిరే అరంభాన్నిచ్చాడు. తొలి అరగంటలోపే అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గోల్ కొట్టాడు. దీంతో దోహా లుసైల్ స్టేడియం హోరెత్తిపోగా ఆ తర్వాత మరో గోల్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. ఫ్రాన్స్ పోరాటంతో మ్యాచ్ షూటౌట్‌కు దారి తీయగా.. కెరీర్లో తన చివరి కిక్‌తో గోల్ కొట్టి ఘనంగా ఆటకు అల్విదా చెప్పాడు. అతడు అడుగేస్తే చాలు హోరెత్తిపోయే మైదానాలు.. అతడు మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు జనసంద్రాలయ్యే
ప్రపంచకప్‌లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ దిగ్గజం మిరొస్లావ్ క్లోజ్ (17) సరసన చేరాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడిగా మెస్సీ రికార్డుల్లోకెక్కాడు. లోథార్ (జర్మనీ; 25) రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సమయ మైదనాంలో ఉన్న ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. తాజా ఫైనల్‌తో మెస్సీ 2,314 నిమిషాలు మైదానంలో గడిపి, పాలొ మాల్డినిని (2,217ని) రెండో స్థానానికి నెట్టివేశాడు.
ఒకే ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్, రౌండ్-16, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.
స్టేడియంలు ఇక ముందు చూడలేమనే తలంపే క్రీడాభిమానులను కలచి వేస్తున్నది.