ఫిఫా ప్రపంచకప్‌లో పెను సంచలనం! హాట్ ఫేవరెట్లుగా భావిస్తున్న టాప్టీమ్స్ జర్మనీ, ఉరుగ్వే అనూహ్యంగా ఇంటిముఖం పట్టాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై విజయాలు సాధించినా ప్రిక్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేకపోయాయి. గోల్స్ తేడా పరంగా సమీకరణాలు మారడంతో ఈ మాజీ చాంపియన్లు లీగ్ దశతోనే తమ ప్రస్థానాన్ని ముగించి అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసియా కింగ్స్ జపాన్, కొరియా దర్జాగా నాకౌట్లోకి దూసుకెళ్లాయి. పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ స్పెయిన్‌ను జపాన్, పోర్చుగల్‌ను కొరియా మట్టికరిపించి మెగాటోర్నీకి మరింత కిక్ తీసుకొచ్చాయి. శనివారం నుంచి ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లు మరింత రంజుగా మారనున్నాయి.
అల్ ఖోర్(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ అభిమానులకు ఫుల్మజా అందిస్తున్నది. టైటిల్ రేసులో ముందంజలో ఉండే టాప్టీమ్స్ జర్మనీ, ఉరుగ్వే ఈసారి ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తూ లీగ్ దశతోనే ఇంటి ముఖం పట్టాయి. కొస్టారికాతో జరిగిన తమ చివరి గ్రూపు-ఈ లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 4-2తో విజయం సాధించింది. జర్మనీ తరఫున హర్వెట్జ్ (73ని, 85ని) డబుల్ గోల్స్ చేయగా, సెర్జె గాన్బ్రె(10ని), ఫ్యుకెల్బర్గ్ (89ని) ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో జపాన్ 2-1తో స్పెయిన్‌పై సంచలన విజయం సాధించింది. డోవాన్ (48ని), టనాకా(51ని) జపాన్‌కు గోల్స్ అందించారు. దీంతో గ్రూపు-ఈ నుంచి జపాన్ (6), స్పెయిన్ (4) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, జర్మనీ (4), కొస్టారికా (3)కు నిరాశే ఎదురైంది. గత (2018) ప్రపంచకప్‌లోనూ లీగ్ దశలోనే నిష్క్రమించిన జర్మనీ ఈసారి అదే బాట పట్టింది.
ఉరుగ్వే ఔట్:
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఉరుగ్వేను దురదృష్టం నీడలా వెంటాడింది. గ్రూపు-హెచ్లో ఘనాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 2-0తో విజయం సాధించింది. అర్కసెటియా(26ని, 32ని)డబుల్ గోల్స్ చేశాడు. మరోవైపు కొరియా 2-1తో పోర్చుగల్‌కు షాక్ ఇచ్చింది. కొరియా జట్టులో యాంగ్వాన్(27ని), హిచన్(90+ని) గోల్స్ చేశారు. దీంతో గ్రూపు-హెచ్ నుంచి పోర్చుగల్(6), కొరియా(4)కు ప్రిక్వార్టర్స్ బెర్తు దక్కగా, ఉరుగ్వే(4), ఘనా(3)ఇంటి బాటపట్టాయి. పాయింట్ల పరంగా కొరియా, ఉరుగ్వే సమంగా ఉన్నా..గోల్స్ తేడా పరంగా కొరియాకు అదృష్టం కలిసి వచ్చింది.