IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్16వ సీజన్ తుది అంకానికి చేరింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ చేరాయి. అయితే.. స్టార్ ఆటగాళ్లను వేలంలో రికార్డు ధర పెట్టి కొన్న కొన్ని జట్లకు నిరాశే మిగిలింది.భారీ ధర పలికిన ఆటగాళ్లలో కొందరు అంచనాలు అందుకోలేక పోయారు. ఫ్రాంఛైజీ తమపై పెట్టుకున్న కొండంత నమ్మకాన్ని నిలబెట్టుకోలేక దారుణంగా విఫలయమ్యారు. టాప్ – 10 ఖరీదైన ఆటగాళ్లు సామ్ కరన్(పంజాబ్ కింగ్స్). కామెరూన్ గ్రీన్(ముంబై ఇండియన్స్), హ్యారీ బ్రూక్(సన్‌రైజర్స్ హైదరాబాద్ ), బెన్ స్టోక్స్(చెన్నై సూపర్ కింగ్స్ ), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఆట ఈ \సీజన్లో ఎలా ఉందంటే..?
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతడిని మినీ వేలంలో రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, సామ్ కరన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభానికి ముందు బిగ్‌బాష్ లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేని అతను పంజాబ్ రాత మార్చలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఫిఫ్టీ బాదాడంతే. 13 ఇన్నింగ్స్‌ల్లో 135.96 స్ట్రైక్ రేటుతో 276 రన్స్ చేశాడు. అంతేకాదు బౌలింగ్‌లో కేవలం 10 వికెట్లు తీశాడంతే. దాంతో, కోట్లు పెట్టినంత మాత్రాన అనుభవాన్ని కొనలేం అంటూ అతడిపై పంజాబ్ మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్ల భారీ ధర పెట్టింది. అయితే.. టోర్నీ ఆసాంతం విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 281 రన్స్ కొట్టిన అతను ఒక్క మ్యాచ్‌తో స్టార్ అయ్యాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటాడు. మూడో స్థానంలో వచ్చి ధనాధన్ ఆడి ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు. 47 బంతుల్లో శతకం సాధించాడు. దాంతో, ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబై ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టింది.
కామెరూన్ గ్రీన్ – 100 నాటౌట్
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాకతో తమ బ్యాటింగ్ బలం పెరుగుతుందని చెన్నై సూపర్ కింగ్స్ భావించింది. అతడి కోసం రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లే ఆడిన అతను తన మార్క్ చూపించలేదు. ఆ తర్వాత గాయం కారణంగా పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. డెవాన్ కాన్వే, మోయిన్ అలీ, మహీశ పథిరన, థీక్షణ అధ్బుతంగా రాణిస్తున్నారు. దాంతో, నలుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడించాల్సి రావడంతో స్టోక్స్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఈ సీజన్లో వెస్టిండీస్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్ మెరిశాడు. విధ్వంసక ఆటగాడైన అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. ఆర్సీబీపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోను గెలుపు వాకిట నిలిపాడు. అంతేకాదు చావోరేవో లాంటి మ్యాచ్‌లో కోల్‌కతాపై హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్నోకు పోరాగలిగే స్కోర్ అందించాడు. దాంతో, లక్నో వరుసగా రెండోసారి మూడో స్థానంతో ప్లే ఆఫ్స్ చేరింది. పూరన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 173.4 స్ట్రైక్ రేటుతో 358 రన్స్ కొట్టాడు. వేలంలో పూరన్‌ను లక్నో రూ. 16 కోట్లకు కోట్లకు కొనుగోలు చేసింది.
నికోలస్ పూరన్
పాకిస్థాన్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీలతో చెలరేగాడు. దాంతో, అతడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.13.25 కోట్లు పెట్టింది. ఈ యంగ్‌స్టర్ తమ జట్టు రాత మారుస్తాడని భావించింది. కానీ, బ్రూక్ దారుణంగా విఫలయమ్యాడు. ఈడెన్స్ గార్డెన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై శతకం తప్పితే అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వరుసగా 8 మ్యాచుల్లో రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. దాంతో, అతడి బదులు న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఆడించాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఫిలిఫ్స్ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టి హైదరాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేశాడు.
హెన్రిచ్ క్లాసెన్ (104)
పదహారో సీజన్లో హైదరాబాద్ జట్టులో నిలకడగా రాణించింది ఎవరంటే.. అది హెన్రిచ్ క్లాసెన్. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడిని ఎస్ఆర్హెచ్ వేలంలో రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న క్లాసెన్ మిడిలార్డర్లో వెన్నెముకలా నిలిచాడు. రెండు అర్ధ శతకాలు బాదిన అతను ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీపై సెంచరీ(104)తో కదం తొక్కాడు. దాంతో, హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదడంతో బెంగళూరు 8 వికెట్లతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. క్లాసెన్ మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రైక్ రేటుతో 448 రన్స్ బాదాడు.