ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే వరల్డ్‌కప్ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. బీసీసీఐ వర్గాల ప్రకారం అతన్ని మరో మూడు మ్యాచ్‌ల వరకు దూరం పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్ధిక్ మడిమ గాయానికి లోనైన విషయం తెలిసిందే. దీంతో అతను ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఇంకా అతను ఆ నొప్పి నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గాయం కోసం చికిత్స తీసుకునేందుకు హార్ధిక్.. సోమవారమే బెంగుళూరులో ఉన్న క్రికెట్ అకాడమీకి వెళ్లారు. గురువారం అతనికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్సీఏ మెడికల్ బృందం హార్దిక్ మళ్లీ ఎప్పుడు ఆడాలన్న విషయాన్ని తేల్చుతుందని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
కివీస్‌తో మ్యాచ్‌కు హార్ధిక్‌ను దూరం పెట్టిన నేపథ్యంలో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మ్యాచ్‌లో శార్దూల్ స్థానంలో షమీని దించారు. కానీ ఆ మ్యాచ్‌లో సూర్య కేవలం రెండు రన్స్‌కే రనౌట్ అయ్యాడు. ఇక షమీ మాత్రం అయిదు వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేశాడు. అయితే ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టులో ఎటువంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. లక్నోలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. ఆ పిచ్‌పై స్పిన్నర్ అశ్విన్‌ను రంగంలోకి దించే ఛాన్సు ఉన్నట్లు భావిస్తున్నారు. అశ్విన్ రాకవల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూడా కాస్త బలపడుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.