Australians Missing Century : క్రికెట్లో సెంచరీలతో రికార్డులు సృష్టించినవాళ్లు చాలామందే. అయితే.. సెంచరీకి ముందు ఔటైన వాళ్ల పేరు కూడా రికార్డుకెక్కిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో ఆస్ట్రేలియా(Australia) వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(Alex Carey) చేరాడు. నిన్న దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన నాలుగో వన్డేలో క్యారీ జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, దురదృష్టం అతడిని వెంటాడింది. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు.
అప్పటివరకూ సఫారీ బౌలర్లను ఉతికారేసిన అతను కగిసో రబడ(Kagiso Rabada) ఓవర్లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేతికి చిక్కాడు. దాంతో, 99 వద్ద వికెట్ పారేసుకున్న నాలుగో ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు విధ్వంసక ఓపెనర్లు మాథ్యూ హెడేన్(Matthew Hayden), ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist), డేవిడ్ వార్నర్ (David Warner)లు మాత్రమే సెంచరీకి
డేవిడ్ వార్నర్
ఒక్క పరుగు దూరంలో పెవిలియన్ చేరారు. భారత్‌తో 2001లో బెంగళూరులో జరిగిన వన్డేలో హెడెన్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రీలంకతో 2003లో జరిగిన ఓ వన్డేలో గిల్‌క్రిస్ట్ 99 వద్ద పెవిలియన్ చేరాడు. నిరుడు లంకపై వార్నర్ ఒక్క పరుగుతో శతకం చేజార్చుకున్నాడు.
సెంచరీ చేజార్చుకున్న క్యారీ
ఓపెనర్ ట్రావిస్ హెడ్(17) రిటైర్ హర్ట్‌గా వెనుదిరగడంతో క్యారీ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే గెరాల్డ్ కోహెట్జీ ఓవర్లో బౌండరీ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన క్యారీ 77 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. రబడ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
హెన్రిచ్ క్లాసెన్(174)
సెంచూరియన్‌లో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ 164 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 416 రన్స్ కొట్టింది. హెన్రిచ్ క్లాసెన్(174), డేవిడ్ మిల్లర్(80) అకాశమే హద్దుగా చెలరేగారు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 252 పరుగులకే ఆలౌటయ్యింది. సిరీస్ డిసైడర్ అయిన ఐదో వన్డే జొహన్నెస్‌బర్గ్‌లో రేపు ఉదయం జరుగనుంది.