సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 21: బీసీసీఐ నిర్వహిస్తున్న అండర్-19 ఉమెన్స్ టీ-20 జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఇటీవలే జట్టును ప్రకటించగా, అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన పన్యాల అక్షయరెడ్డి, కరీంనగర్ జిల్లాకేంద్రానికి చెందిన కట్ట శ్రీవల్లి ఉన్నారు. తిరుపతిరెడ్డి-శ్రావ్య దంపతుల కూతురు అక్షయరెడ్డి హైదరాబాద్ మల్లాపూర్‌లోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. నాలుగేళ్లుగా క్రికెట్లో రాణిస్తున్నది. ఎస్జీఎఫ్ఐలో క్రికెట్లో నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఉమా- లక్ష్మారెడ్డి దంపతుల కూతురు శ్రీవల్లి ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. ముంబైలో ఈనెల 26నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, ఈ ఇద్దరు యువతులు ఆడనున్నారు.