అఫ్గానిస్థాన్ తరఫున టీ20 లలో ఒక బౌలర్ ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి. గతంలో ఈ రికార్డు రషీద్ ఖాన్ (5/3) పేరిట ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో అయితే అఫ్గాన్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ముజీబ్ స్కాట్లాండ్పై (5/20) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. నెదర్లాండ్స్ (39, 44), వెస్టిండీస్ (55) ముందున్నాయి.
గయానా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అఫ్గానిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంభించింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్న ఉగాండా కనీసం పోటీని కూడా ఇవ్వలేదు. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఉగాండా అందుకు తగ్గ మూల్యమే చెల్లించుకుంది. అంతగా అనుభవం లేని ఉగాండా బౌలర్లపై అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్ (45 బంతుల్లో 76, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (46 బంతుల్లో 70, 9 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లతో విరుచుకుపడి తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలోనే ఏకంగా 154 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి దూకుడుతో అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది.
అనంతరం ఛేదనకు దిగిన ఉగాండా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫరూఖీ (5/9) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఆ జట్టు విలవిల్లాడింది. ఫరూఖీకి తోడు నవీనుల్ హక్ (2/4), రషీద్ ఖాన్ (2/12) రాణించడంతో ఉగాండా 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో రాబిన్సన్ ఒబుయా (14) టాప్ స్కోరర్. రియాజత్ (11) మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 183/5 (గుర్బాజ్ 76, జద్రాన్ 70, మసబ 2/21, కొస్మస్ 2/25).
ఉగాండా: 16 ఓవర్లలో 58 ఆలౌట్ (ఒబుయా 14, రియాజత్ 11, ఫరూఖీ 5/9, నవీనుల్ 2/4)