Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో చెలరేగి ఆడుతున్న అభి.. ఒకే ఏడాది అత్యధిక సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ భారత క్రికెటర్లకు సాధ్యమవ్వని రికార్డును తన పేరిట రాసుకున్నాడీ చిచ్చరపిడుగు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో ఆకాశమే హద్దుగా ఆడుతున్న ఈ పంజాబీ లెఫ్ట్ హ్యాండర్ సర్వీసెస్‌పై 3 సిక్సర్లతో ఒకే ఏడాది వంద సిక్సర్ల ఫీట్ నమోదు చేశాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీతో చితక్కొట్టిన అభిషేక్ శర్మ.. టీ20ల్లోనూ తన తడాఖా చూపిస్తున్నాడు. దొరికిన బంతిని దొరికినట్టే స్టాండ్స్‌లోకి పంపే అభి.. ఒక క్యాలండర్ ఇయర్లో వంద సిక్సర్లతో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది జింబాబ్వే, శ్రీలంకపై, ఆసియా కప్‌లో మోత మోగించిన ఈ హిట్టర్ .. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదరగొట్టి సెంచరీ కొట్టేశాడు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 2022లో 68 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2023లో శివాలెత్తిపోయిన హిట్‌మ్యాన్ 67 సిక్సర్లతో మూడో ప్లేస్‌లో.. యువకెరటం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) నిరుడు 36 సిక్సర్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
Most sixes by an Indian in a year! 💥
Abhishek Sharma becomes the first Indian to smash 100 T20 sixes in a calendar year! 🔥🇮🇳 pic.twitter.com/NnVNUSQsAS— CricketGully (@thecricketgully) December 6, 2025
ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో దంచికొట్టిన అభిషేక్ పొట్టి క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ రికార్డు సృష్టించాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 27 ఇన్నింగ్స్‌ల్లో 1,000 రన్స్ పూర్తి చేసుకోగా.. అభిషేక్ 28 ఇన్నింగ్స్‌ల్లోనే థౌజండ్‌వాలా క్లబ్లో చేరాడు.
కేఎల్ రాహుల్ (29 ఇన్నింగ్స్‌లు), సూర్యకుమార్ యాదవ్(31 ఇన్నింగ్స్‌లు), మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(40 ఇన్నింగ్స్‌లు)లు టాప్-5లో ఉన్నారు. అయితే.. బంతుల పరంగా చూస్తే అభిషేక్ శర్మదే అగ్రస్థానం. 528 బంతుల్లో అభిషేక్ టీ20ల్లో వెయ్యి పరుగులు అందుకున్నాడు. సూర్యకుమార్ 573 బంతుల్లో, ఇంగ్లండ్ చిచ్చరపిడుగు ఫిల్ సాల్ట్ 599 బంతుల్లో ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 604 బంతుల్లో, ఆండ్రూ రస్సెల్(వెస్టిండీస్), ఫిన్ అలెన్(న్యూజిలాండ్)లు 609 బంతుల్లో వెయ్యి క్లబ్లో చేరారు.
Top 5 performers in Round 6 of SMAT 2024-25 ft. Abhishek Sharma https://t.co/IElCva36nU pic.twitter.com/qKSMKdEkAP
— Sportskeeda (@Sportskeeda) December 7, 2025