వర్షం అంతరాయం మధ్య జరిగిన తొలిపోరులో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా.. అదే జోష్‌లో మలి పోరులోనూ విజయం సాధించి ఐర్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరుగనున్న రెండో టీ20లో యువభారత్.. ఐర్లాండ్‌తో మరోమారు అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల పరంగా హార్దిక్ సేన ఫేవరెట్‌గా కనిపిస్తుండగా.. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతున్నది.
డబ్లిన్: పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో టీ20 జరుగనుండగా.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వర్షం కారణంగా తొలి పోరులో 12 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకాగా.. మంగళవారం కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను కలవరపెడుతున్నది. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్‌పై అందరి దృష్టి నిలువగా.. కండరాల గాయంతో తొలి పోరులో ఓపెనింగ్ చేయలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడా తేలాల్సి ఉంది. మరోవైపు పొట్టి ఫార్మాట్లో భారత ఎనిమిదో కెప్టెన్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా టీ20ల్లో వికెట్ తీసిన తొలి భారత సారథిగా రికార్డుల్లోకెక్కాడు. తొలుత బంతితో ఆకట్టుకున్న పాండ్యా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో భారీ షాట్లతో విజృంభించి జట్టును ముందుండి నడిపించాడు. మ్యాచ్ అనంతరం అతడి మాటల్లోనూ పరిణతి కనిపించగా.. చాన్స్ వస్తే ఓపెనర్‌గానూ రాణించేందుకు సిద్ధమే అని దీపక్ హుడా నిరూపించుకున్నాడు.
నాయకుడు ముందుండి..
ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన ఇషాన్ కిషన్‌తో పాటు రుతురాజ్ కోలుకోకుంటే.. దీపక్ హుడా మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హార్దిక్ పాండ్యా.. మంగళవారం ఇదే రిపీట్ అయితే బ్యాటింగ్ ఎంచుకునే చాన్స్ లేకపోలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మైదానంలో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరువలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ ఈ సారి విజృంభించాలని చూస్తున్నాడు. హార్దిక్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరూ పవర్ హిట్టర్లు ఫినిషర్లుగా ఉండటం భారత్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బాధ్యతాయుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అవేశ్ ఖాన్ ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేయగా.. అరంగేట్ర పోరులో ఉమ్రాన్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. మరోసారి మనవాళ్లంతా సమిష్టిగా రాణిస్తే.. ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు! మరోవైపు తొలి పోరులో ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ ఆకట్టుకున్నాడు. మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడుతూ.. అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం టెక్టర్‌పై ప్రశంసలు కురిపించిన హార్దిక్ పాండ్యా.. బ్యాట్ బహుమతిగా ఇవ్వడంతో పాటు ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కాలని ఆకాంక్షించాడు.