కోల్‌కతా: లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ అదరగొట్టింది. బాలికల విద్య, మహిళల సాధికారత కోసం దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ నిర్వహిస్తున్న ఖుషి ఫౌండేషన్‌కు నిధుల సేకరణ నిమిత్తం ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా నిర్వహించారు. వరల్డ్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన పోరులో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఓబ్రెయిన్(52) అర్ధసెంచరీకి తోడు రామ్‌దిన్ (42 నాటౌట్) రాణించడంతో జెయింట్స్ 20 ఓవర్లలో170/8 స్కోరు చేసింది. పంకజ్ సింగ్(5/26) ఐదు వికెట్లతో విజృంభించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మహారాజాస్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. శ్రీవాత్సవ్(54), యూసుఫ్ పఠాన్(50 నాటౌట్) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.