శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 01, 2020 , 22:40:32

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

తొగుట : తెలంగాణలో ఉత్తమ విద్య అందించడానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు. మండలంలోని ఘనపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో శనివారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేటు పాఠశాలల మూలంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవుతుందని అనుకుంటున్న సమయంలో ఘనపూర్‌లో హెచ్‌ఎం రాజిరెడ్డి చొరవతో గ్రామస్తులు కలిసి కట్టుగా పాఠశాలను కాపాడుకున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆమె తెలిపారు. మిగతా పాఠశాలలు ఘనపూర్‌ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్న సమయంలో గ్రామస్తుల్లో చైతన్యం తీసుకువచ్చి 130 విద్యార్థులను పాఠశాలలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మన పాఠశాలలను మనమే కాపాడుకోవాలన్నారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట రెండవ స్థానంలో నిలిచిందని, ఈసంవత్సరం మొదటి స్థానంలో ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఎంఈవో, హెచ్‌ఎంలతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు వచ్చేలా కష్టపడి చదువుకోవాలన్నారు. 10/10 గ్రేడ్‌ మార్కులు సాధించిన వారికి రూ.25 వేలు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారని, ఎఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిధులు రాగానే పాఠశాలలో గ్రంథాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. 

నైతిక విలువల బాధ్యత తల్లితండ్రులదే..

ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే సామాజిక అంతరాలు తొలిగిపోయి కుల, మతాలు సమిసి పోయి  జాతీయభావం పెంపొందాలంటే ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కూర రఘోంత్తంరెడ్డి అన్నారు. కార్పొరేట్‌ విద్యతో విద్యలో విలువలు పడిపోయాయని  విద్యార్థులకు నైతిక విలువలు అందించాల్సిన బాధ్యత తల్లితండ్రుల మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

స్ఫూర్తిగా తీసుకోవాలి డీఈవో..

మూతపడిపోతుందన్న ఆందోళన నుంచి జిల్లాకే స్ఫూర్తిగా నిలుస్తున్న పాఠశాలగా ఘనపూర్‌ నిలిచిందని డీఈవో రవికాంతారావు అన్నారు. విద్యార్థులకు గ్రామస్తుల సహకారంతో అన్ని రకాల వసతులు కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారికి స్నాక్స్‌ అందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలను ముందు వరుసలో నిలుపవచ్చన్న సంగతిని ఘనపూర్‌ వాసులు నిజం చేశారని పేర్కొన్నారు.  ఈసందర్భంగా పాఠశాల అభివృద్ధికి చేయూత అందించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి, దాతలకు హెచ్‌ఎం రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి రూ.2లక్షల నిధులు కేటాయిస్తామని జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంఈవో సత్తు యాదవరెడ్డి, సర్పంచ్‌ కుంభాల వెంకటమ్మ, ఎంపీటీసీ కొమ్ము శరత్‌, విద్యా కమిటీ చైర్మన్‌ బుచ్చిరాజుతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


logo