శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 03, 2020 , 22:58:14

మృగాళ్లకు యావజ్జీవం

మృగాళ్లకు యావజ్జీవం
  • బాలికపై ముగ్గురు యువకుల సామూహిక లైంగికదాడి
  • జగదేవ్‌పూర్‌ మండలంలో ఘటన
  • వేగంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు
  • 23 మంది సాక్షుల విచారణ
  • నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా
  • తీర్పు చెప్పిన సంగారెడ్డి ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్‌ స్పెషల్‌ కోర్టు

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : మాయమాటలతో బాలికను అపహరించి సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు నేరస్తులకు సంగారెడ్డి జిల్లా మొదటి సెషన్‌ కోర్టు శిక్ష విధించింది. 8 నెలల్లో కేసు విచారణ పూర్తి కాగా నేరం రుజువుకావడంతో నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే కాకుండా ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పాపిరెడ్డి తీర్పు వెలువరించారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగదేవ్‌పూర్‌ మండలం రాయవరం గ్రామానికి చెందిన  బాలికను 2019, మే 15న రాత్రి 11 గంటల సమయంలో కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన శివరాత్రి వెంకట్‌ (21), నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన శివరాత్రి ఆంజనేయులు (21), రాయపోల్‌ మండలం పెద్ద ఆరెపల్లి గ్రామానికి చెందిన మానకొండ శ్రీరామ్‌ (24) కలిసి మాయమాటలు చెప్పి బైకు పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని గోపాల్‌పూర్‌ టీ జంక్షన్‌ వద్ద ఉన్న చింతచెట్టు వద్ద బాలికపై  పలుసార్లు సామూహిక లైంగికదాడికి  పాల్పడ్డారు. అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను దొంగలించినట్లు బాధితురాలు మే16న జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ సాయిరాం, గజ్వేల్‌ ఏసీపీ నారాయణకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. అదే నెల 19న నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించారు. 


సీపీ జోయల్‌ డెవిస్‌ సూచనల మేరకు పటిష్టంగా టెక్నికల్‌ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ చేయడంతో పాటు 23 మంది ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను విచారించారు. నేరస్తులు, బాధితురాలు వస్తువులను సేకరించి హైదరాబాద్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించి సాక్షాలను మరింత పకడ్బందీగా తయారు చేసి కోర్టు ముందుంచారు. కేసుపై కోర్టులో వాదనలు, సాక్షుల వాంగ్మూలం పూర్తయిన తర్వాత నేరం రుజువు కావడంతో డిస్ట్రిక్‌ సెషన్‌ కోర్టు న్యాయమూర్తి పాపిరెడ్డి శిక్ష విధించారు. నిందితులు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. నిందితురాలి తరఫున వాదించిన అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో పాటు కేసు దర్యాప్తునకు సీఐ శివలింగం, ఎస్‌ఐ సాయిరాం, పోలీసులు సత్యనారాయణ, పరుశరాములు తదితరులు సహకరించారన్నారు.


logo