Twitter CEO Salary | మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ వేతనం 10 లక్షల డాలర్లు. మన కరెన్సీలో రూ.7,51,13,500. వీటితోపాటు 12.5 మిలియన్ డాలర్ల విలువ గల స్టాక్స్ కేటాయిస్తారు. 2022 ఫిబ్రవరి నుంచి వీటిని 16 త్రైమాసికాల్లో ఆయనకు కేటాయిస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి పనితీరు ఆధారంగానూ స్టాక్స్‌ను అందుకోనున్నారు పరాగ్ అగర్వాల్.
అగ్రశ్రేణి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు సారధ్యం వహిస్తున్న భారతీయుల క్లబ్లో పరాగ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తదితర భారతీయ సీఈవోల క్లబ్లో పరాగ్ అగర్వాల్ చేరడం భారతీయులందరికీ గర్వకారణం. 2011లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ట్విట్టర్లో అడుగు పెట్టిన పరాగ్ అగర్వాల్ 2017 అక్టోబర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులయ్యారు.
పరాగ్ అగర్వాల్.. ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి కేంద్ర ప్రభుత్వ అణు ఇంధనశాఖ (డీఏఈ)లో పని చేశారు. ఆయన తల్లి స్కూల్ టీచర్‌గా సేవలందించారు. ముంబైలోని అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.
అటుపై అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 2006-2009 మధ్య కొద్దికాలం మైక్రోసాఫ్ట్, యాహూలో రీసెర్చ్ విభాగంలో పని చేశారు. 2010లో ఏటీ అండ్ టీ లాబ్‌లో కొద్ది కాలం సేవలందించారు.