డబ్బు కావాలంటే బ్యాంకుకు గానీ.. ఏటీఎం సెంటర్‌కు గానీ వెళ్లనక్కర్లేదు. కరోనా పుణ్యమా? అని ఏడాది కాలంగా పలు సంస్థలు ఆన్లైన్ పేమెంట్స్ దిశగా వేగంగా అడుగులేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో స్థానిక వ్యాపారులు, కిరాణా స్టోర్లు దూకుడుగా వెళుతున్నాయి. అదే సమయంలో అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలకు చాలా మంది బాధితులవుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు ఎంత తేలిగ్గా సాగుతాయో అంతే భారీగా ఆన్లైన్ అంటే సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎటువంటి ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ జరుపడానికైనా పబ్లిక్ నెట్‌వర్క్‌కు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ హాట్‌స్పాట్స్, హోటళ్లలో వై-ఫై, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో పబ్లిక్ నెట్‌వర్క్‌ను వాడొద్దని చెబుతున్నారు. పబ్లిక్ నెట్‌వర్క్‌లు బహిరంగం. వీటి ద్వారానే హ్యాకర్లు మీ బ్యాంకింగ్ ఖాతాల కీలక డేటాను దొంగిలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక మీ మొబైల్ ఫోన్‌తో అనుసంధానమైన పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో మాత్రమే ఫైనాన్సియల్ లావాదేవీలు జరుపడం ఉత్తమం అని అంటున్నారు.
మీ ఫోన్లో గానీ, డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో ఏదేనీ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆ యాప్‌లు ఆర్థికేతరమైనవైనా సరే.. ఎల్లవేళలా అవి కంపెనీలు అధికారికంగా ప్రారంభించిన యాప్‌లేనా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లోని (గూగుల్ ప్లే స్టోర్, విండోస్ యాప్ స్టోర్, ఐఫోన్ యాప్ స్టోర్)లోకి వెళ్లి అందుబాటులో ఉన్న యాప్ స్టోర్ నుంచి బ్యాంకింగ్, షాపింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని బ్యాంక్ బజార్ డాట్ కామ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) మురారీ శ్రీధరన్ చెప్పారు. అటువంటి అధికారిక యాప్‌లు మాత్రమే ఎన్క్రిప్టెడ్ (గుప్తీకరించిన) సమాచారాన్ని ఇతర అధికారిక చానెల్స్‌కు పంపుతాయన్నారు. అప్పుడే మీ ట్రాన్సాక్షన్స్ సురక్షితం అని మురారి శ్రీధరన్ చెప్పారు. తాత్కాలిక యాప్స్‌లో అత్యవసర ఖాతాల వివరాలు వాడొద్దని హెచ్చరించారు.
మిమ్మల్ని ఆకర్షించడానికి లేదా అత్యవసరం అన్న సంకేతాలిచ్చేలా మీకు పలు వెబ్సైట్లు, టెక్స్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ వస్తుంటాయి. అటువంటి లింక్‌లను క్లిక్ చేసే పనిలో పడొద్దని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో ఏనాడూ మీరు ఫాలోకానీ లింక్స్ దాదాపు ఫేక్. అవి మీ మొబైల్ బ్యాక్ గ్రౌండ్లో ఉన్న మీ ఫైనాన్సియల్, వ్యక్తి గత డేటాను తస్కరించడానికి ఉపయోగపడే షిఫింగ్ వెబ్సైట్లు అని హెచ్చరిస్తున్నారు.
అన్ని వేళలా హెచ్‌టీటీపీఎస్ (HTTPS)తో మొదలయ్యే వెబ్సైట్లలో మాత్రమే మీరు తప్పనిసరిగా మీ వ్యక్తిగత, ఫైనాన్సియల్ సమాచారం నమోదు చేయాలి. హెచ్టీటీపీతో మొదలయ్యే వెబ్సైట్లను క్లిక్ చేయొద్దంటున్నారు మురారి శ్రీధరన్. HTTPSతో మొదలయ్యే వెబ్సైట్ల కనెక్షన్లకు మాత్రమే సెక్యూర్ సాకెట్స్ లేయర్ ఉంటుంది. ప్రముఖ బ్యాంకు, ఆర్థికసంస్థ ప్రతినిధినంటూ ఫోన్ చేసే వ్యక్తికి మీ ఖాతా నంబర్, పాస్వర్డ్, ఫోన్ నంబర్, అడ్రస్, క్రెడిట్ కార్డు డిటైల్స్ పొరపాటున కూడా చెప్పొద్దంటున్నారు.