Realme Pad 3 | మొబైల్స్ తయారీ సంస్థ రియల్‌మి భారత్‌లో నూతనంగా రియల్‌మి ప్యాడ్ 3 పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్ ని విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా ధర కూడా తక్కువగానే ఉంది. ఈ ట్యాబ్‌లో 12,200ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. 11.61 అంగుళాల 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే కూడా ఉంది. ఈ ట్యాబ్ క్వాడ్ స్పీకర్ సెటప్ ను, స్లిమ్ ఫాం ఫ్యాక్టర్ ను కలిగి ఉంది.మెటల్ బ్యాక్ డిజైన్ తో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. కనుక దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ప్యాడ్ స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. ఇది కేవలం 6.6 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంది. పైగా మెటల్ బ్యాక్ప్లేట్ కూడా ఉంది. కనుక ట్యాబ్ లుక్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ ట్యాబ్‌కు ఎగువ భాగంలో ఎడమ వైపు కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పై భాగంలో ఉంటాయి. ఈ ట్యాబ్ డిస్ప్లేకు 2.8కె రిజల్యూషన్‌ను ఇచ్చారు. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. 550 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను ఇది కలిగి ఉంది. ఇక ఈ ట్యాబ్ కేవలం 578 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. కనుక సులభంగా క్యారీ చేయవచ్చు. ఈ ట్యాబ్‌కు గాను 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను ఇచ్చారు. కనుక దీన్ని వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 6.4 వాట్ల రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ట్యాబ్‌ను పూర్తిగా చార్జింగ్ చేస్తే నాన్ స్టాప్‌గా 17 గంటల వరకు వీడియోలను చూడవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ట్యాబ్ సినిమాటిక్ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.
ఇందులో 8 మెగాపిక్సల్ వెనుక కెమెరా ఉండగా, ముందు భాగంలోనూ అదే కెపాసిటీ ఉన్న కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాల సహాయంతో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కలిగిన వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అలాగే ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డెమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌ను, 256జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ర్యామ్‌ను అదనంగా మరో 10జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. అందువల్ల ట్యాబ్ వేగంగా పనిచేస్తుంది. ల్యాగ్ ఉండదు. విద్యార్థులకు ఈ ట్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ట్యాబ్‌లో ఏఐ రికార్డింగ్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
రియల్‌మి ప్యాడ్ 3 కి చెందిన 128జీబీ వైఫై మోడల్ ధర 26,999 ఉండగా, 5జి 128జీబీ మోడల్ ధర రూ. 29,999 గా ఉంది. టాప్ ఎండ్ 256 జీబీ మోడల్ ధర రూ. 31,999 గా ఉంది. ఇవన్నీ 8 జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాడ్ పై పలు బ్యాంకులు రూ. 2000 వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. రియల్‌మి ప్యాడ్ 3ని జనవరి 16వ తేదీ నుంచి విక్రయిస్తారు. రియల్‌మి అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ లలో లభ్యం కానుంది.