Jolla Phone | అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఓ లైనక్స్ ఆధారిత ఫోన్‌ను లాంచ్ చేశారు గుర్తుందా..? 2013లో ఆ ఫోన్ వచ్చింది. అదేనండీ.. జొల్లా (Jolla) అని అప్పట్లో లాంచ్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ఫోన్ కనిపించకుండా పోయింది. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఆ ఫోన్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ మార్కెట్లో Jolla Phone ఫోన్‌గా లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం చాలా వరకు అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలోని కామన్ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. వాస్తవానికి Jolla అనేది ఓ ఫిన్ లాండ్ కంపెనీ. ఈ కంపెనీయే అప్పుడు, ఇప్పుడు ఫోన్లను లాంచ్ చేసింది. ఇక ప్రస్తుతం లాంచ్ చేసిన జొల్లా ఫోన్లోనూ పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. స్నో వైట్, కామోస్ బ్లాక్, ది ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో 6.36 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్లో యూజర్లకు జొల్లా కంపెనీ డెవలప్ చేసిన సెయిల్ఫిష్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీన్ని లైనక్స్ ఆధారంగా రూపొందించారు. కనుక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు దీనికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక ఈ ఫోన్‌కు ఓ ప్రైవసీ స్విచ్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో ఒకేసారి మైక్రోఫోన్, కెమెరా, బ్లూటూత్, లేదా ఇతర ఎంపిక చేసిన యాప్స్ ను ఆఫ్ చేసుకోవచ్చు. ఇది దీనికి ఉన్న ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
ఈ ఫోన్లో బ్యాటరీని యూజర్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. సాధారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో బ్యాటరీని తీసేయలేము. కానీ జొల్లా ఫోన్లో ఉన్న బ్యాటరీని కావాలనుకుంటే తీసే విధంగా ఆప్షన్ ఇచ్చారు. కనుక ఇది కూడా ఇందులో ఉన్న ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ బ్యాటరీ 5500 ఎంఏహెచ్ కెపాసిటీని కలిగి ఉంది. అలాగే బ్యాక్ కవర్‌ను సైతం యూజర్లు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌కు గాను ఏకంగా 5 ఏళ్ల వరకు సాఫ్ట్ వేర్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ ను పూర్తిగా యురోపియన్ ప్రమాణాలు, నియమాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందు వైపు ఉన్న కెమెరా రిజల్యూషన్ గురించి మాత్రం వివరాలను వెల్లడించలేదు.
ఈ ఫోన్లో మీడియాటెక్ 5జి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. కానీ ఏ మోడల్ అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్లో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో ఉన్న సెయిల్ ఫిష్ ఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను సైతం సపోర్ట్ చేస్తుంది. అందుకు గాను జొల్లా యాప్ సపోర్ట్‌ను వాడాల్సి ఉంటుంది. ఇక ఇందులో 5జి, డ్యుయల్ సిమ్, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ వంటి సదుపాయాలను సైతం అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. అయితే ఈ ఫోన్‌కు ప్రస్తుతం ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఇందుకు గాను యూజర్లు ముందుగా 115 డాలర్లను (దాదాపుగా రూ.10,409) చెల్లించాల్సి ఉంటుంది. తమకు 2వేల యూనిట్స్ ప్రీ ఆర్డర్ లభిస్తే ఈ ఫోన్లను తయారు చేసి అందిస్తామని కంపెనీ తెలిపింది. కనుక అందుకు మరో నెల సమయం పట్టనున్నట్లు వివరించింది. ఇక ఈ ఫోన్ ధర సుమారుగా 815 డాలర్లుగా (దాదాపు రూ.73వేలు) ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌ను జనవరిలో వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. యూకే, నార్వే, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాల్లో ముందుగా ఈ ఫోన్ లభ్యం కానుంది.