ఇంట్లో ఉన్నప్పుడో, విహారయాత్రలకు పోయినప్పుడో హాయిగా ఉంటాయని చాలా మంది నిక్కర్లు… అదే షార్ట్స్‌ను ఇష్టపడతారు. అందులోనూ సెలెబ్రిటీలు అభిమానించే ఇటాలియన్ బ్రాండ్ లోరో పియానా ఇటీవల ఒక తెలుపు షార్ట్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాల్మర్ బెర్ముడా షార్ట్స్ పేరిట రూపొందిన ఈ షార్ట్స్ ధర తొంభై వేల రూపాయలు. 70 శాతం నూలు, ఫ్లాక్స్గా పిలిచే ప్రకృతి సిద్ధ ఫైబర్ దారాల మేళవింపు ఇది. uk.loropiana.com లో ఆర్డర్ చేసుకోవచ్చు.
ఎండవేళ నూలు దుస్తులు ధరిస్తే వడగాలికి తెరకట్టినంత ఉపశమనంగా ఉంటుంది. అందులోనూ మెత్తగా పల్చగా ఉండే మల్మల్ కాటన్ బట్టలు ఒంటికి ఎంత హాయిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగని ఫ్యాషన్ లేకుండా వీటిని వేసుకోవాలంటే అమ్మాయిలు ఒప్పుకోరుగా. అందుకే ఎక్కడా తగ్గేదేలే… అంటూ మెత్తటి మల్మల్ కాటన్ వస్త్రంతోనే గ్రాండ్‌గా కనిపించేలా గరారాను రూపొందించింది ప్రీవిన్ సంస్థ. పగటి సూర్యుడిలా పసుపు వన్నెలో దర్శనమిస్తున్న ఈ డ్రెస్‌కు అద్దాలతో పాటు ఎంబ్రాయిడరీని జతచేసింది. విశాలమైన గేరా ఉండే గరారా ప్యాంట్, పెద్ద టాజిల్స్‌తో వచ్చిన చిన్నటాప్, నాజూకైన దుపట్టా దీని ప్రత్యేకతలు. సమ్మర్ ఫంక్షన్లకు అతికినట్టు సరిపోయే ఈ డ్రెస్ ధర రూ.13,999. ogaan.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రతి వస్తువునూ అలంకారానికి, అందానికి పనికొచ్చేలా తయారు చేస్తున్నారు మనవాళ్లు. అతిథులకు మంచితీర్థం అందించే గ్లాసులు సైతం ఇదే కోవలో చేరిపోయాయి.
ఐరా ఉదయ్‌పూర్ సంస్థ కళాత్మకంగా హ్యాండ్ బ్లోన్ గాబ్లెట్ గ్లాసులను తయారుచేసింది. సముద్ర నీలం, సిరాబ్లూ లాంటి రంగుల్లో ప్రత్యేకమైన హ్యాండిల్ డిజైన్‌తో రూపొందించారు వీటిని. డైనింగ్ టేబుల్‌కే అందాన్ని తీసుకొచ్చేలా ఉన్నాయివి. జ్యూస్ తాగేందుకు కూడా వాడుకోవచ్చు. Houseofthings.com వెబ్సైట్లో దొరుకుతున్నాయి. నాలుగు గ్లాసుల సెట్టు ధర రూ. 5,800.
ప్రకృతిలోని పరమాద్భుతాల జాబితా తీస్తే… అందులో పువ్వులూ, సీతాకోకచిలుకలూ తప్పక ఉంటాయి. ఆ సహజ సౌందర్యాలను అందాల నగలో బందీ చేసింది అజ్గా జువెలరీ సంస్థ. ఇత్తడితో చేసిన హ్యాండ్ కఫ్స్‌కు బంగారు పోతపోశారు. ముచ్చటగా తీర్చిదిద్దిన పువ్వు, సీతాకోకచిలుకలకు నీలివన్నెల ఎనామిల్ మరింత ఆకర్షణను తీసుకువచ్చింది. దీన్ని చేతికి అలంకరించుకోవచ్చు. ఫయోర్ కఫ్ పేరిట జైపూర్‌కి చెందిన కళాకారులు తీర్చిదిద్దారు. నచ్చితే azga.in ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఖరీదు రూ.5,650.