Infinix Hot 60 5G Plus | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇన్ఫినిక్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు చాలా తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫినిక్స్ కంపెనీ కూడా ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ కంపెనీ హాట్ 60 5జి ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.7 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా 6జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్‌కు గాను వన్ ట్యాప్ ఏఐ బటన్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు వాతావరణ అప్డేట్స్, కెమెరా కంట్రోల్, చాటింగ్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్లకు కూడా ఈ బటన్ ఒక కీ మాదిరిగా పనిచేస్తుంది. షార్ట్స్, న్యూ ఈవెంట్, మ్యాప్ డైరెక్షన్స్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే శాంసంగ్ కు చెందిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఉండే సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్‌ను సైతం ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫీచర్ లభిస్తున్న బడ్జెట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. అయితే ఈ ఫోన్‌ను 5 ఏళ్ల వరకు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉపయోగించుకోవచ్చని, ఇందుకు గాను ఫోన్‌కు టీయూవీ ఎస్‌యూడీ సర్టిఫికేషన్ కూడా లభిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌కు గాను ఐపీ64 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో సింగిల్ వేరియెంట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమోరీని కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లేకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. రెండు సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్డీ కార్డు కోసం ప్రత్యేకంగా 3 స్లాట్లను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ హాట్ 60 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్, షాడో బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జూలై 17 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే రూ.2,999 విలువైన ఇయర్ బడ్స్‌ను సైతం ఉచితంగా పొందవచ్చు.