న్యూయార్క్ : గత ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 13 ప్రొ మోడల్స్ లాంఛ్ చేయగా ఈ స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో అధిక డిమాండ్ నెలకొంది. ఐఫోన్ 13 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడటంతో సరఫరాలు పెంచేందుకు ఆయా మోడల్స్ ఉత్పత్తిని పెంచేందుకు యాపిల్ సన్నద్ధమవుతోంది.
ఈ ఏడాది రెండో క్వార్టర్లో ఏప్రిల్-జూన్ మధ్య ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ ఉత్పత్తిని ఏకంగా కోటి యూనిట్లు పెంచేందుకు యాపిల్ సన్నాహాలు చేపట్టిందని డిజిటైమ్స్ కధనం పేర్కొంది. చైనాలో కొవిడ్-19 లాక్‌డౌన్‌తో కంపెనీ సరఫరా గొలుసు సమస్యలను ఎదుర్కొంటోంది. కరోనా నియంత్రణలతో ఫాక్స్‌కాన్, పెగట్రన్ ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడటం ఉత్పత్తిలో అవాంతరాలు నెలకొన్నాయి. ఈ నెల ఆరంభంలో యాపిల్ సరఫరా దారు పెగట్రన్ తన షాంఘై, కున్షన్ ప్లాంట్లను నిలిపివేసింది.
పెగట్రాన్ ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ సహా పలు ఉత్పత్తుల తయారీ చేపట్టింది. లాక్డౌన్ కారణంగా ఈ ఉత్పత్తుల షిప్మెంట్లపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. లాక్డౌన్లతో సరఫరా సమస్యలను అధిగమిస్తూ ఉత్పత్తి పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది. ఇక చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 13 స్ధానికంగా అసెంబ్లింగ్ చేయనున్నట్టు కంపెనీ ఇటీవల ప్రకటించింది.