న్యూఢిల్లీ : మధ్య, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ వేతనంలో విప్రో ఇటీవల కోత పెట్టగా తాజాగా మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులందరి అస్ధిర వేతనాల్లో 30 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సిబ్బందికి సగటున 70 శాతం వేరియబుల్ పే ఇస్తామని ఐటీ కంపెనీ పేర్కొంది.
జూన్ 2022 క్వార్టర్లో సగటు వేరియబుల్ చెల్లింపుల్లో కంపెనీ 30 శాతం కోత విధించింది. వేతన పెంపు వంటి ఉద్యోగుల వ్యయాలు పెరగడం, నూతన నియామకాలకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తుండటంతో వేరియబుల్ పేలో కోత విధించాల్సి వచ్చిందని ఇన్ఫోసిస్ చెప్పుకొచ్చింది. వేరియబుల్ పేలో సగటున 70 శాతం చెల్లిస్తామని అయితే తుది వేరియబుల్ పే ఆయా డిపార్ట్మెంట్ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఆగస్ట్ వేతనంతో కలిపి వేరియబుల్ పే చెల్లించనున్నట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇక గత వారం విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మార్జిన్ల ఒత్తిడి కారణంగా పనితీరు ఆధారంగా ఇచ్చే అదనపు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వేరియబుల్ పేలో కోత పెట్టిన విషయాన్ని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.