Secret cameras | టెక్నాలజీ పురోగతి మానవాళి సురక్షితంగా మనుగడ సాగించేందుకే! కానీ, ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలను గమనిస్తే సాంకేతికత కారణంగా మంచి కన్నా.. చెడే ఎక్కువగా జరుగుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. మనిషి పైశాచిక ఆనందాలకు టెక్నాలజీ వేదిక అవుతున్నది. డిజిటల్ ముసుగులో నేరాలు-ఘోరాలు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. ఇవన్నీ మహిళలు కేంద్రంగానే జరుగుతుండటం శోచనీయం. ఈ విశృంఖల దాడులకు పాచికలుగా మారుతున్నాయి సీక్రెట్ కెమెరాలు. మనిషి రక్షణ కోసం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కనిపెట్టిన సీక్రెట్ కెమెరాలు.. నేడు ఎంతోమంది అమ్మాయిలకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
షాపింగ్ మాల్స్, హోటళ్లు, కాలేజీలు, ఆఫీస్ సహా మనం ఉండే ఇంటి బయట, చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ భద్రతపరంగా మనకు రక్షణ కల్పిస్తాయన్నది వాస్తవం. అయితే.. కొందరు నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. ఆ ఫుటేజీ ఆధారంగా బాధితులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఓ ఇంజినీరింగ్ కాలేజీలో, మరోచోట హోటల్లో ఏర్పాటుచేసిన హిడెన్ కెమెరాలు అతివల భద్రతపై అనుమానాలు రేకెత్తించాయి. ఈ సంఘటనలు హిడెన్ కెమెరాలను డేగ కండ్లతో గమనించి మసులుకోవాలని హెచ్చరిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్డీ) లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే హిడెన్ కెమెరా కేసులు 23 శాతం పెరగటం ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో సగటు మనిషి తన ప్రైవసీని కాపాడుకోవడాన్ని విధిగా అలవాటు చేసుకోవాలి. అందుకు ఈ జాగ్రత్తలు పాటించండి.
ఏ లాడ్జ్కో, రిసార్ట్కో వెళ్తే.. గదిలోని ప్రతి మూలనూ జాగ్రత్తగా పరిశీలించాలి. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న అనుమానం వస్తే… మరింత లోతుగా పరిశీలించడం అవసరం. అసాధారణమైన వస్తువుల విషయలో అప్రమత్తంగా ఉండాలి. కొందరు కీచకులు.. హోటల్ గదుల్లో ఉండే గడియారాలు, స్మోక్ డిటెక్టర్లు, యూఎస్బీ చార్జింగ్ బ్లాక్‌లకు సీక్రెట్ కెమెరాలు అమర్చుతుంటారు. ఏదైనా సందేహం వస్తే.. ఆయా పరికరాలను అన్‌ప్లగ్ చేయాలి. బ్యాటరీతో పనిచేసేవి అయితే.. బ్యాటరీ తొలగించాలి. సీక్రెట్ కెమెరాలు రాత్రిళ్లు పనిచేయడానికి వీలుగా.. వాటికి ఇన్ఫ్రారెడ్ లెన్స్ ఉంటాయి. వాటిని కనిపెట్టడం బ్రహ్మవిద్య కాదు. గదిలోకి వెళ్లగానే లైట్లు మొత్తం ఆఫ్ చేయాలి. కిటికీలకు కర్టెన్లు వేయాలి. గదిని వీలైనంత చీకటిగా మార్చాలి. ఇప్పుడు మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి.. గదంతా స్కాన్ చేయాలి. మొబైల్ కెమెరా దేన్నయినా ఫోకస్ చేసిందంటే.. అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్టే లెక్క! దాన్ని క్షుణ్నంగా పరిశీలించి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
కొన్నిసార్లు ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి కూడా హిడెన్ కెమెరాల గుట్టు పట్టొచ్చు. గదిని పూర్తిగా చీకటిగా మార్చి… ఫ్లాష్ లైట్ వెలుగులో పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. గదిలో ఎక్కడైనా నీలం లేదా ఊదా రంగులో మెరుస్తున్నట్టు కనిపించిందా.. సమ్‌థింగ్ రాంగ్ అనుకోవచ్చు. ఆ వెలుగు వచ్చిన చోట మినీ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గదంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏదైనా అనుమానాస్పదమైన శబ్దాలు వచ్చినా, క్లిక్‌మని వినిపించినా వెంటనే అలర్ట్ కావడం అవసరం.
కొన్ని రహస్య కెమెరాలు ఉపయోగంలో ఉన్నప్పుడు కాంతిని విడుదల చేస్తాయి. ఆ కాంతిని పసిగట్టడానికి గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లు చాలానే ఉన్నాయి. వీటిని ఉపయోగించి రహస్య కెమెరాలను ఛేదించవచ్చు,
హిడెన్ కెమెరాలు వైఫై నెట్‌వర్క్‌తో పనిచేస్తాయి. ఇవి రికార్డు చేసిన వాటిని వైఫై ద్వారా ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. అందుకే, హోటల్ గదిలోకి వెళ్లాక వైఫై నెట్‌వర్క్‌లు ఉన్నాయో, లేదో చెక్ చేయాలి. ఇందుకోసం మీరు WiFiman, NetSpot, Fing లాంటి నెట్వర్క్ స్కానర్ అప్లికేషన్లు ఉపయోగించవచ్చు. ఈ యాప్ ద్వారా ఏదైనా అనుమానాస్పద నెట్వర్క్ కనిపిస్తే, దానిపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. వాళ్లు స్పందించకపోతే.. పోలీసులను సంప్రదించాలి.
ఆర్ఎఫ్ డిటెక్టర్లతో గది మొత్తాన్ని డిటెక్టర్‌తో స్కాన్ చేయడం ద్వారా వైర్లెస్ సిగ్నల్స్ కనిపెట్టొచ్చు. దీంతో రహస్య కెమెరాల్ని కనిపెట్టడం చాలా సులభం. సీక్రెట్ కెమెరా డిటెక్టర్ యాప్‌లను ప్రయత్నించొచ్చు. అయితే, అవి కచ్చితంగా పనిచేస్తున్నాయని చెప్పలేం.
మీరు విడిది చేసిన గదుల్లోగానీ.. షాపింగ్ మాల్స్‌లో గాని.. అద్దాలను చెక్ చేయడం చాలా అవసరం. ముందుగా మీ వేలును అద్దానికి ఆనించాలి. మీ వేలికీ, అద్దానికి మధ్య ఎలాంటి స్పేస్ లేనట్టుగా కనిపిస్తే.. అనుమానించాల్సిందే! వెంటనే విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా పరాయి నెలవుకు వెళ్లినప్పుడు, బంధువుల ఇంట రాత్రి గడపాల్సి వచ్చినప్పుడు.. మీరు ఉండే గదిని క్షుణ్నంగా పరిశీలించడం అత్యవసరం. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.
హిడెన్ కెమెరాలకు చిక్కినవారిలో ఎక్కువ శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలు ఎవరు చూశారు? వైరల్ అవుతాయేమో? నెట్లో పెడతారేమో?.. అని భయాందోళనలకు గురవుతున్నారు. దీన్నే ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న బాధితులు వెంటనే నిపుణుల సలహాలు తీసుకోవాలి. అంతేకాదు.. కుటుంబసభ్యుల అండతో ధైర్యంగా ముందుకు సాగాలి. కట్టుదిట్టమైన సైబర్ చట్టాల సాయంతో నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలి.