శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jun 20, 2020 , 23:12:20

రవాణా మెరుగు

రవాణా మెరుగు

  • రూ.5.50 కోట్లతో రాజ్‌పేట బ్రిడ్జి నిర్మాణం  
  • హర్షం వ్యక్తం చేస్తున్న పరిసర ప్రాంతవాసులు 

హవేళిఘనపూర్‌  :  వర్షాకాలం వచ్చిందంటే మండల పరిధిలోని రాజ్‌పేట వద్ద గంగమ్మవాగు ఉధృతంగా ప్రవహించేది. దీంతో రాజ్‌పేటతో పాటు కొత్తపల్లి, కప్రాయిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ఎలాంటి అత్యావసర పరిస్థితులు ఉన్నా.. మెదక్‌కు వెళ్లలేని పరిస్థితి. ఈ బ్రిడ్జిని టీడీపీ హయాంలో తూతూమంత్రంగా నిర్మించగా, అది శిథిలమై కూలిపోయే స్థితికి చేరుకున్నది. దీంతో వర్షం వచ్చి వాగు ఉధృతి పెరిగితే ఎప్పుడు కూలుతుందో తెలియని భయాందోళన పరిస్థితి నెలకొనేది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రారంభోత్సవం చేసినా.. నిర్మాణానికి నోచుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాబార్డు ద్వారా రూ.5.50కోట్ల నిధులను మంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బ్రిడ్జిని ప్రారంభించారు. దీంతో మెదక్‌ జిల్లా సరిహద్దు గ్రామం కొత్తపల్లి, రాజ్‌పేట, కప్రాయిపల్లి ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా పోల్కంపేట ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం మెరుగు పడింది. బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసినందుకు స్థానికులు ఎమ్మెల్యేకు, స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


logo