valimai | తారాగణం: అజిత్ కుమార్, కార్తికేయ, హ్యుమాఖురేషి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ జీఎం సుందర్, అచ్యుత్ కుమార్
సంగీతం: యువన్‌శంకర్‌రాజా, జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా
నిర్మాణ సంస్థలు: బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
నిర్మాత: బోనీకపూర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హెచ్. వినోద్
తమిళనాట తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అగ్రహీరోల్లో అజిత్ ఒకరు. ఆయన సినిమా అంటే అభిమానులు ఓ పండగలా భావిస్తారు. గత కొన్నేళ్లుగా వరుసగా భారీ విజయాలు సాధిస్తుండటంతో అజిత్ సినిమాలకు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అజిత్ ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ హంగులతో తెరకెక్కించిన సినిమా అంటూ ప్రచారం జరగడంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ‘వలిమై’ ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకుంది? అజిత్ విజయాలపరంపరను కొనసాగించారో లేదో చూద్దాం..
విశాఖపట్నంలో డ్రగ్స్, చైన్‌స్నాచింగ్స్, దోపిడీలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటుంది సైతాన్ స్లేవ్స్ అనే ఓ ముఠా. అద్దెకు తీసుకున్న రేసింగ్ బైక్‌లతో నేరాలకు పాల్పడుతుంటారు. వీరికి నాయకుడు నరేన్ (కార్తికేయ). రోజురోజుకూ సైతాన్ స్లేవ్స్ ముఠా ఆగడాలు ఎక్కువ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ ముఠా ఆటకట్టించడానికి రంగంలోకి దిగుతాడు ఏసీపీ అర్జున్ ( అజిత్‌కుమార్). సైతాన్ స్లేవ్ ముఠా అసాంఘిక కార్యకలాపాల్ని ఛేదించే క్రమంలో అర్జున్ ఓ చేదు నిజాన్ని తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో బైకర్స్గ్యాంగ్ను తుదముట్టించడానికి అర్జున్ అనుసరించిన వ్యూహమేమిటి? తన డిపార్ట్మెంట్లోనే చేసిన కుట్రల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు లక్ష్యాన్ని సాధించాడా? లేదా? అన్నదే మిగతా కథ..
అగ్రహీరో సినిమా అంటే ఇమేజ్ను ఎలివేట్ చేసే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే ఏదో సందేశం తప్పనిసరి. ఈ సూత్రాన్ని బ్యాలెన్స్ చేస్తూ కథను కొత్తగా చెప్పాలి. ‘వలిమై’ సినిమా విషయంలో దర్శకుడు వినోద్ అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. డ్రగ్స్, చైన్‌స్నాచింగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలతో మధ్యతరగతి యువత నిర్వీర్యమవుతున్నారు. వారు ఆ ఊబి నుంచి బయటపడాలనే అంతర్లీన సందేశంతో దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. ఈ మెసేజ్‌ను అజిత్ వంటి స్టార్ హీరో ద్వారా చెబితే బలంగా ఉంటుందని భావించాడు.
అయితే కథను అర్థవంతంగా తెరపైకి తీసుకొచ్చే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథ మీద ఏమాత్రం దృష్టిపెట్టకుండా యాక్షన్ ఘట్టాలకే అధిక ప్రాధాన్యతనిచ్చాడు. దాంతో కథ, కథనాలతో ప్రేక్షకులు ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోతారు. ఈ సినిమా కథలో ఫ్యామిలీ, మదర్సెంటిమెంట్ అంశాలు ఏమాత్రం ఇమడలేదనిపించింది. అజిత్ ఫ్యాన్స్‌ను సంతృప్తిపరిచేందుకు బలవంతంగా కొన్ని అంశాల్ని ఇరికించారనే భావన కలుగుతుంది. కథలో ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నా వాటిని ప్రేక్షకులు సులభంగా ఊహించే వీలుండటంతో అవి ఏమాత్రం థ్రిల్‌ని పంచలేకపోయాయి. ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు ఆయువుపట్టుగా చెప్పొచ్చు. ప్రథమార్థంలో వచ్చే బస్, బైక్ ఛేజింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయి. ఇండియన్ సినిమాలో ఈ స్థాయి బైక్ ఛేజింగ్ పోరాటఘట్టాలు రాలేదనే చెప్పొచ్చు.
స్వతహాగా రేసర్ అయిన అజిత్ పోరాటఘట్టాల్లో అద్భుతంగా నటించాడు. గతంలో అజిత్ పోలీస్ అధికారి పాత్రల్లో తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో మాత్రం ఆయన పాత్ర అంత శక్తివంతంగా అనిపించలేదు. ఆయన కాస్త ఒళ్లు చేయడంతో తెరపై మునుపటి ఛరిష్మా మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫక్తు కమర్షియల్ అంశాల కలబోతగా రాసుకున్న ఈ కథలో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ప్రేక్షకులకు కేవలం యాక్షన్ ఘట్టాలు మాత్రమే గుర్తుండిపోతాయి. హాలీవుడ్ బైక్రేసింగ్ నేపథ్య చిత్రాల్ని గుర్తుకుతెచ్చేలా దర్శకుడు వినోద్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను అదరహో అనేలా ఆవిష్కరించారు. అవే ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ కథలో ఏమాత్రం కుదరలేదు.
అజిత్ వన్మేన్షోగా ఈ సినిమాను అభివర్ణించవొచ్చు. బరువు పెరిగి కాస్త బొద్దుగా కనిపిస్తుండటం వల్ల పోలీస్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయంచేయలేకపోయారనే భావన కలుగుతుంది. అయితే ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన మార్క్ ప్రదర్శించారు. అజిత్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా పండగలా అనిపిస్తుంది. ఇక తెలుగు యువహీరో కార్తికేయ విలన్‌గా మెప్పించాడు. ఆయన పాత్ర నిడివి కూడా ఎక్కువ ఉండటం ప్లస్ పాయింట్‌గా మారింది. కార్తికేయ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. హ్యుమాఖురేషి తన పరిధి మేరకు నటించింది. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
కేవలం అజిత్ అభిమానులకు, యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. అంతకుమించి ఈ సినిమా కథలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు.
రేటింగ్: 2.5/5