సినిమా : యానిమల్
తారాగణం: రణ్‌బీర్‌కపూర్, అనిల్‌కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్నా..
దర్శకత్వం: సందీప్‌రెడ్డి వంగ
నిర్మాతలు: భూషణ్‌కుమార్, కిషన్‌కుమార్, మురద్ ఖేతానీ, ప్రణయ్‌రెడ్డి వంగ
తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తోనే కల్ట్ మూవీ డైరెక్టర్‌గా కితాబులందుకున్నాడు సందీప్‌రెడ్డి వంగ. నిజానిక్కూడా ఆ సినిమాలో ఆయన టేకింగ్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అదే కథను హిందీలో ‘కబీర్‌సింగ్’గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఒకే కథతో ఇటు టాలీవుడ్లో, అటు బాలీవుడ్లో భారీ విజయాలను అందుకున్న సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన రెండో సబ్జెక్ట్ ‘యానిమల్’. రణబీర్‌కపూర్, రష్మిక, అనిల్‌కపూర్, బాబీడియోల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి తొలి సినిమా మ్యాజిక్‌ని సందీప్ రిపీట్ చేశాడా? లేక వన్ సినిమా వండర్‌గా మిగిలిపోయాడా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకెళ్లాలి.
విజయ్(రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు. చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగితా కథ.
తెరపై ఈ తరహా ఎమోషన్ కొత్తే అని చెప్పాలి. కుటుంబం కోసం ఎంతదూరమైనా వెళ్లే కొడుకుల కథలు గతంలో చాలావచ్చినా.. ఇందులో హీరో రియాక్టయ్యే విధానం కొత్తగా ఉంటుంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మూడున్నర గంటల్లో ఓ పెద్ద జీవితాన్నే చూపించేశాడు. ఒక వృద్ధుడు తన జీవితంలో ఎదురైన సంఘటనలు గుర్తుచేసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. రెండు భాగం ఆలోచన ఉండటంతో కథకు ముగింపు మాత్రం ఇవ్వలేదు. హీరో కేరక్టరైజేషన్‌కి తగ్గట్టుగా కథనం అల్లుకున్నాడు. ప్రేమ ముదిరితే పిచ్చి అవుతుందంటారు. ఇంట్లోవాళ్లపై హీరో చూపిస్తున్న ప్రేమ చూసే ప్రేక్షకులకు పిచ్చిలాగే అనిపిస్తుంది. కోపానికీ, ప్రేమకీ నియంత్రణ ఉండదు. మానసికంగా అతనో దిగంబరుడు. ప్రపంచంతో పనిలేదు. తనేం చేసినా ఓపెన్‌గా చేసేస్తాడు. అలాగే బతుకుతాడు. చుట్టూ ఉన్న పాత్రలు కూడా అతన్ని అర్థం చేసుకునే పాత్రలే కావడం విశేషం. ఈ కేరక్టరైజేషనే ఈ సినిమాకు ప్రదాన బలం. నాన్నని చంపాలని చూస్తున్నవాళ్లను చంపుకుంటూ వెళ్లడమే ఈ సినిమా కథ. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన కుదుపులు, ఒడిదుడుకులు, సంఘటనలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయి. వాస్తవానికి అద్దం పట్టేలా కొన్ని సన్నివేశాలను రాసుకున్నాడు సందీప్. అవి యువతరాన్ని కట్టిపడేస్తాయి. అయితే రక్తపాతం మరీ ఎక్కువ అవ్వడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ‘యానిమల్’ అని పేరు పెట్టినంతమాత్రాన మరీ అంత దారుణంగా చూపించక్కర్లేదేమో అనిపిస్తుంది.
నటీనటుల నటన
ఈ సినిమా విషయంలో పాత్రధారుల నటన నిజంగా అద్భుతం. రణ్‌బీర్‌కపూర్ యానిమల్గా మారిపోయాడు. ఓ విధంగా తెరపై విశ్వరూపమే చూపించాడు. అతని నటనకోసం సినిమా చూడొచ్చు. అనిల్‌కపూర్, రణ్‌బీర్ కాంబినేషన్ సీన్స్ కానీ, రణ్‌బీర్, రష్మిక కాంబినేషన్ సీన్స్ కానీ సూపర్బ్. తండ్రీకొడుకులుగా రణ్‌బీర్, అనిల్‌కపూర్ ఒదిగిపోయి నటించారు. రష్మిక సామాన్యమైన నటి కాదు, ఆమెలో గొప్ప నటి దాగుందని ఈ సినిమా తెలియజేసింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్. రణ్‌బీర్, రష్మిక కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌కి విపరీతంగా నచ్చేస్తాయి. బాబీడియోల్ కూడా అద్బుతంగా నటించారు. మిగతా పాత్రధారులంతా కూడా పరిధిమేర రక్తికట్టించారు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా కూడా సినిమా బావుంది. అయితే, సంభాషణల విషయంలో ఇంగ్లిష్ డైలాగులు మరీ ఎక్కువయ్యాయి. వీటివల్ల సామాన్య ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు అర్థంకావ్. అవసరం అనుకుంటే ఇంగ్లీష్ వాడాలనికానీ, అనవసరంగా అన్నన్ని ఇంగ్లిష్ డైలాగులు ఎందుకు? ఇక సంగీతం విషయానికొస్తే.. పాటలు అంత గొప్పగా ఏం లేవ్. అయితే, హర్షవర్దన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం మాత్రం అద్బుతం. కెమెరా వర్క్ చాలా బావుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది. తెరపై ప్రతి సన్నివేశం రిచ్‌గా అనిపించింది. సాంకేతికంగా సినిమా సూపర్. ఇక సందీప్‌రెడ్డి వంగా సినిమాను నడిపిన విధానం బావుందికానీ, మరీ మూడున్నర గంటల నిడివి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కథనం కూడా కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఏదేమైనా ‘అర్జున్‌రెడ్డి’ విషయంలో కూడా విమర్శలు ఎదురయ్యాయి. కానీ జనానికి నచ్చేసింది. ఈ సినిమా కూడా నచ్చేయొచ్చు.
ప్లస్ పాయింట్స్:
పాత్రధారులు నటన, హీరో కేరక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్
రక్తపాతం ఎక్కవ అవ్వడం, డైలాగుల్లో ఆంగ్లం ఎక్కువ అవ్వడం, పాటలు, కథనంలో కన్ఫ్యూజన్..
రేటింగ్ : 3.00/5