బషీరాబాద్, జూలై 20 : మండలంలోని రెడ్డిఘనపూర్ గ్రామంలో పంచాయతీ భవనం విషయంలో తాజా, మాజీ సర్పంచ్ల మధ్య పంచాయితీ కొనసాగుతుండగా అధికారులకు తలనొప్పిగా మారిం ది. బిల్లులు చెల్లించనంటూ తాజా సర్పంచ్ బసంత్, బిల్లులు చెల్లిస్తేనే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తానని మాజీ సర్పంచ్ వంశీకృష్ణగౌడ్ అధికారులకు తేల్చి చెప్పారు. పంచాయతీలో తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా నూతన పంచాయతీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని మాజీ సర్పంచ్ స్పష్టం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ రూ.10 లక్షల బిల్లులు చెల్లించాలని పేర్కొంటున్నాడని, అంత మొత్తం బిల్లులు చెల్లించడం కుదరదని తాజా సర్పంచ్ పేర్కొంటున్నారు.
అభివృద్ధి పనులకు రూ.8 లక్షలు, కార్మికులకు సంబంధించి రూ. 2 లక్షలు ఖర్చు చేసినా ఇప్పటికీ ఒక్క రూపాయీ రాలేదని వంశీకృష్ణగౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా నూతన పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు వెచ్చించగా.. ప్రభు త్వం నుంచి రూ.17 లక్షలే విడుదలయ్యాయని తెలిపారు. మిగిలిన మొత్తంతోపాటు పంచాయతీలో చేసిన ఇతర పనుల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇటీవల పంచాయతీ భవ నం అప్పగింతపై అధికారులు తనను సంప్రదించగా ఎంపీడీవో సమక్షంలోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించినట్టు మాజీ సర్పంచ్ తెలిపారు. రావాల్సిన డబ్బులు చెల్లించకుండా భవనాన్ని అప్పగించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. బిల్లులు చెల్లించనని చెప్పడం లేదని.. వాస్తవంగా చేసిన పనులకు చెల్లిస్తామని తాజా సర్పంచ్ స్ప ష్టం చేశారు. దీంతో జీపీ భవన పంచాయితీ ఇప్ప ట్లో తెగేలా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.