ఆ గ్రామం ఒకప్పుడు మారుమూల పల్లె. 566 గ్రామపంచాయతీల్లో అదొక గ్రామపంచాయతీ. కేసీఆర్ పాలనలో ఆ గ్రామపంచాయతీ జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకునే స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాలోని చీమలదరి గ్రామపంచాయతీకి అంతర్జాతీయ స్థాయి ఐఎస్వో 9001-2015 గుర్తింపుతోపాటు ఒకసారి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో, రెండుసార్లు మండల స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డులు సాధించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతోపాటు గ్రామాభివృద్ధికి సర్పంచ్ చేస్తున్న కృషికి గ్రామ ప్రజలు ఐక్యంగా అందిస్తున్న పూర్తి సహకారంతో చీమలదరి గ్రామపంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గత నాలుగేండ్లలో గ్రామపంచాయతీలో కనీస మౌలిక సదుపాయాలు తదితరవాటికి దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్మించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా చీమలదరి గ్రామ ప్రజలకు ఉచిత వైఫై సేవలందిస్తున్నారు. ఆన్లైన్లో ధ్రువీకరణ తదితర పత్రాలను జారీ చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను నివేదించేందుకు ప్రత్యేకంగా చీమలదరి పేరిట యాప్‌ను రూపొందించారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
– వికారాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూలై 2, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికిగాను పల్లెప్రగతి కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాల ద్వారా భారీగా నిధులిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి. రాష్ట్ర సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాలోని చీమలదరి పంచాయతీకి అంతర్జాతీయ స్థాయి ఐఎస్వో గుర్తింపుతోపాటు ఒకసారి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో, రెండుసార్లు మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందింది. గ్రామ ప్రజలకు అందిస్తున్న సత్వర సేవలకుగాను చీమలదరి గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ స్థాయి ఐఎస్వో గుర్తింపు లభించడం గమనార్హం. అదేవిధంగా సుపరిపాలనలో భాగంగా రాష్ట్రంలోనే కేవలం చీమలదరి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతోపాటు గ్రామాభివృద్ధికి సర్పంచ్ చేస్తున్న కృషికి గ్రామ ప్రజలు ఐక్యంగా అందిస్తున్న పూర్తి సహకారంతో చీమలదరి గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతుండడం గమనార్హం. నాలుగేండ్లలో దాదాపు రూ.5కోట్లతో కనీవినీ ఎరుగని విధంగా పంచాయతీని ప్రగతిపథంలోకి తీసుకువచ్చారు. చీమలదరి గ్రామ పంచాయతీలో 1397 జనాభా ఉండగా, 376 గృహాలున్నాయి.
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు..
మోమిన్‌పేట్ మండలం చీమలదరి పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. చీమలదరి గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి ఐఎస్వో గుర్తింపు రావడం గమనార్హం. క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, సుస్థిర అభివృద్ధిలో చీమలదరి గ్రామ పంచాయతీకి ఐఎస్వో 9001-2015 గుర్తింపు లభించింది.
ఉచిత వైఫై సేవలు..
జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం చీమలదరి గ్రామంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు. సర్పంచ్ నర్సింహారెడ్డి సొంత డబ్బులతో గ్రామ ప్రజలకు వైర్లెస్ వైఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలందిస్తున్నారు.
జాతీయస్థాయి అవార్డు..
చీమలదరి పంచాయతీలో అందిస్తున్న సుపరిపాలనతో గుడ్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది. గ్రామ పంచాయతీలోనే ప్రజలకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో మాదిరిగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు మ్యుటేషన్ తదితరాలకు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పంచాయతీ సిబ్బంది ఆన్లైన్లో సేవలందించనున్నారు.
గల్లీగల్లీకి సీసీ రోడ్డు..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో చీమలదరి పంచాయతీ స్వచ్ఛ పంచాయతీగా రూపుదిద్దుకున్నది. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. మురుగునీరు రోడ్లపై పారకుండా గ్రామమంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామమంతా ప్రత్యేక వీధిలైట్లను ఏర్పాటు చేశారు. కరెంట్ సరఫరా నిలిచిపోయినా వీధి దీపాలు వెలిగేలా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీకి రోడ్ల వారీగా నంబర్లను కేటాయించారు. గ్రామస్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పంచాయతీకి దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేయగా, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు, అండర్ డ్రైనేజీకి రూ.46 లక్షలు, సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3 లక్షలు, రూ.3లక్షలతో విలేజ్ బోర్డులు, రూ.9 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చీమలదరి గ్రామ పంచాయతీ సచివాలయం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్మించారు. మరోవైపు ప్రతీనెల పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.1.30 లక్షల నిధులు వస్తుండగా, గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వెంచర్లతో రూ.1.30 కోట్లు పన్ను రూపంలో రావడం గమనార్హం.
మన చీమలదరి యాప్..
చీమలదరి గ్రామ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పోలీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచి తమ సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువచ్చేందుకుగాను ప్రత్యేకంగా మన చీమలదరి పేరిట యాప్‌ను రూపొందించారు. త్వరలోనే గ్రామ ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
చిట్టడవిని తలపించేలా పల్లెప్రకృతి వనం..
పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం చిట్టడవిని తలపించేలా మారింది. ప్రకృతి వనంలో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. 30 రకాల కానుగ, గుల్మెహర్, టెకోమా, జామ, బకునియా, గన్నేరు, నీలగిరి, సర్వి, శిశు, టేకు, రెయిన్‌ట్రీ, గులాబీ, అల్లనేరేడు మొక్కలను నాటారు. ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి పంచాయతీ కార్మికులు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తున్నారు. చెత్త సేకరణకు డబ్బాలను కూడా అందజేశారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అందులో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. గత రెండేండ్లుగా కంపోస్ట్ ఎరువును తయారీ చేస్తూ గ్రామంలోని మొక్కలకు వినియోగిస్తూ వస్తున్నారు.
పక్కా ప్రణాళికతో అభివృద్ధి..
ప్రభుత్వం, ప్రజలు అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామ పంచాయతీలోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర ఆన్లైన్ సేవలు, ఫ్రీ వైఫై సేవలను అందించనున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేశాం. మా గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచడమే నా లక్ష్యం.
– ఎన్.నర్సింహారెడ్డి, సర్పంచ్