కోతల బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి.. చేస్తున్నదానికి పొంతన ఉండడంలేదు అనడానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. రూ.2,91,159 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారడీనే తప్ప..
- హామీలకు అనుగుణంగా కేటాయింపులేవి?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఊసేలేదు
- పంచాయతీలకు ప్రత్యేక నిధులు నిల్
- సంక్షేమ పథకాలను అటకెక్కించే ప్రయత్నం
- పారిశ్రామిక రంగానికి మొండి చేయి
- గొల్లకురుమలు, మత్స్యకారులను విస్మరించిన రేవంత్ సర్కార్
- రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై సబ్బండ వర్గాల అసంతృప్తి
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి.. చేస్తున్నదానికి పొంతన ఉండడంలేదు అనడానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. రూ.2,91,159 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారడీనే తప్ప.. అక్కరకొచ్చేది కాదని తేలిపోయింది. హామీలకు తగ్గ కేటాయింపులు జరపకపోవడంతో అంతా ఒట్టి మాటలేనన్న! విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి అవకాశాలతోపాటు, ప్రజల జీవన స్థితి గతులను మార్చే కొత్త పథకాలేవీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా నిధుల కేటాయింపులు జరగలేదు. ఫార్మాసిటీని రద్దు చేసి టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామన్న ప్రకటనను సైతం అటకెక్కించింది. మెట్రో విస్తరణకు మొక్కుబడిగానే నిధులను కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు ప్రధాన నీటివనరైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో మొండి చేయి చూపించారు. గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మంగళం పాడడంతో ఉమ్మడి జిల్లాలోని సబ్బండ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
-రంగారెడ్డి, జూలై 25 ( నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో ఇటీవల పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్, టూరిజం, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు భవిష్యత్తులో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసుకోబోతున్నామని హామీ ఇచ్చారు. న్యూయార్ సిటీతో పోటీపడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ప్రకటించారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అనువుగా మార్చుతామని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతున్నదని, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఈ దిశగా బడ్జెట్లో ఎటువంటి నిధుల కేటాయింపులను ప్రభుత్వం జరపలేదు. రద్దు చేసిన ఫార్మాసిటీ ప్రాంతంలో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామన్నది కూడా బూటకమేనని ప్రస్తుత బడ్జెట్‌తో తేలిపోయిందని ఈ ప్రాంత ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ హయాంలోనే ఉన్న హయత్‌నగర్‌కు మెట్రో ప్రతిపాదన.. కార్యరూపంలోకి తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు కంటి తుడుపుగా కేవలం రూ.200 కోట్లతోనే సరిపెట్టింది. పారిశ్రామికంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును పొందిన రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలోనూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నది.
అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో నిర్మించనున్న అనంతగిరి ఎకో టూరిజంపై బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ.. రాష్ట్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కొంతమేర నిధులు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. వికారాబాద్ జిల్లాకు మణిహారంగా మారనున్నదని ప్రజానీకం కలలుగన్న మొబిలిటీ వ్యాలీకి నిధులు కేటాయించలేదు. ఆరేడు నెలలుగా నిలిచిపోయిన ఈ పనులు బడ్జెట్ అనంతరం వేగవంతమవుతాయని అనుకున్న జిల్లా ప్రజల ఆశలపై రేవంత్ ప్రభుత్వం నీళ్లు చల్లింది.
పాలమూరు పరుగులకు బ్రేక్ ..
కేసీఆర్ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రస్తుత బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులేవీ జరపక రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015లో శ్రీకారం చుట్టింది. రూ.35వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన ఈ ఎత్తిపోతలతో మొదటి విడతలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో విడతలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో చేసిన పోరాటంతో ఎత్తిపోతలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి పనులు పరుగులు పెట్టాయి. గతేడాది అప్పటి సీఎం కేసీఆర్ లాంఛనంగా నీటిని సైతం విడుదల చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచే సాగు, తాగు నీటిని అందించేలా ప్రభుత్వం డిజైన్ చేయగా.. ఇందుకు సంబంధించి రూ.5,180 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది.
ఉద్దండాపూర్ నుంచి నిర్మించే మెయిన్ కెనాల్ 16.5కిలోమీటర్ల వద్ద లెఫ్ట్, రైట్ కెనాల్స్‌ను నిర్మించి నీరందించేలా డిజైన్ చేశారు. లెఫ్ట్ కెనాల్ నుంచి వికారాబాద్ జిల్లా వైపుగా.. రైట్ కెనాల్ నుంచి రంగారెడ్డి జిల్లా ప్రాంతాలతో పాటు మునుగోడు వరకు నీరందించేలా గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంత రైతాంగానికి జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పట్ల ఆదినుంచీ నిర్లక్ష్యాన్ని కనబరుస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ప్రత్యేకించి ఎటువంటి నిధులను కేటాయించకపోవడంతో పనుల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొన్నది.
అటకెక్కనున్న సంక్షేమ పథకాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలతోపాటు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల కొనసాగింపుపై నీలినీడలు అలుముకున్నాయి. బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడంతో గ్యారంటీల అమలుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత కుటుంబాల సాధికారతకోసం దళితబంధును చేపట్టి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలమంది లబ్ధిదారులకు రూ.10లక్షల చొప్పున అందజేసింది. ఆ డబ్బులతో వారు పశు పోషణ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోళ్ల ఫారం, రవాణా రంగాలకు సంబంధించిన యూనిట్లను లబ్ధ్దిదారులు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.
రెండో విడతలో మరింతమందికి సాయం అందించేందుకు కార్యాచరణ మొదలుపెట్టగా..ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అలాగే..కులవృత్తులకు జీవం పోయాలని సంకల్పించిన కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ద్వారా తొలి విడతలో వేల మంది గొల్లకురుమలకు మేలు జరుగగా.. రెండో విడతలో మరిన్ని యూనిట్ల అందించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు నిధులను కూడా వెచ్చించేందుకు కార్యాచరణను రూపొందించగా… ఎన్నికలు రావడంతో ఈ పథకానికి సైతం బ్రేక్ పడింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలను కొనసాగించేలా బడ్జెట్లో ఎటువంటి నిధుల కేటాయింపులు జరపకపోవడంతో వీటికి మంగళం పాడినట్లేనని తెలుస్తున్నది. ఇక బడ్జెట్లో రైతు భరోసా ప్రస్తావనే లేదు.
బడ్జెట్‌పై వెల్లువెత్తుతున్న అసంతృప్తి..
రాష్ట్ర బడ్జెట్‌పై అని వర్గాల్లో అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఎన్నికల ముందు ఎన్నో హామీలను గుప్పించిన కాంగ్రెస్.. బడ్జెట్లో మాత్రం అందుకనుగుణంగా కేటాయింపులు జరుపలేదని ప్రజలు వాపోతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తావనే లేకపోవడంపై మండిపడుతున్నారు. మొదటి నుంచి పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్.. బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా పంతం నెగ్గించుకున్నదని దుయ్యబడుతున్నారు. పారిశ్రామికరంగానికి సంబంధించి పాలసీ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఔత్సాహికులు ఆశగా ఎదురుచూడగా అసలు ఈ విషయమై చర్చించకపోవడం వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెలు, చేపపిల్లల పంపిణీని విస్మరించి వారి జీవితాలను అగాథంలోకి నెట్టిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2 వేల సాయం అందిస్తామని హామీనిచ్చి బడ్జెట్లో అందుకు సంబంధించి నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
తీవ్ర అన్యాయం…
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కుల వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. నిబంధనల పేరుతో చాలామంది అర్హులైన రైతులను రుణమాఫీకి దూరం చేసింది. రూ.లక్షలోపు రుణాలకు సంబంధించి కొంతమంది రైతులకే మాఫీ చేసి చేతులెత్తేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడి సాయాన్ని అందజేస్తే.. కాంగ్రెస్ వానకాలం సీజన్ సగం పూర్తయినా ఇప్పటికీ సాయం అందించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేక అస్తవ్యస్తంగా మారిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసింది.
వివిధ కులవృత్తులు, మహిళలు, యువతకు సంబంధించిన పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చేపట్టకపోవడం, జిల్లాలో విద్య, వైద్య, రవాణా తదితర రంగాలకు ప్రత్యేకించి ఎటువంటి నిధులను కేటాయించకపోవడంపై సబ్బండ వర్గాల ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
గొల్లకురుమలకు బడ్జెట్లో అన్యాయం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొల్లకురుమలకు అన్యాయం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో అధిక నిధులను కేటాయించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. గొర్రెలు, మేకలు పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేసింది. దీంతో ఎంతో మంది గొల్లకురుమలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇంకా గొర్రెల యూనిట్ల కోసం అప్పుడు డీడీలు కట్టిన వారు ఉన్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో చెప్పాలి. గొల్ల కురుమలను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
-శ్రీనివాస్ యాదవ్, అల్లాపూర్, తాండూరు
బడ్జెట్లో మత్స్యకారులకు నిధులు కేటాయించకపోవడం విచారకరం..
రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారులకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం విచారకరం. చేపల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక పథకాలను అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకుంటుందని ఎన్నో కలలు కన్నాం. బడ్జెట్లో సరైన నిధులు కేటాయించకపోవడంతో మోసం చేసిందని మత్స్యకారులంతా ఆవేదన చెందుతున్నారు. మమ్మల్ని విస్మరించిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం.
-లక్ష్మీనారాయణ, మత్స్య సంఘం అధ్యక్షుడు దుప్‌చెర్ల
మత్స్యకారులకు మంగళం పాడారు..
మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పలికింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు ఎన్నో విధాలుగా సాయం చేసి ఆదుకున్నది. కుంటలు, చెరువులను నీళ్లతో నింపడంతో పాటు చేపల వేటకు సంబంధించి సామగ్రి, ద్విచక్రవాహనాలు, మోపెడ్లు, టాటాఏస్ వాహనాలను అందించి అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరం. కాంగ్రెసోళ్ల మాయమాటలు విని గెలిపిస్తే మా మత్స్యకారులను మరిచింది. రానున్న రోజుల్లో మత్స్యకారుల తడాఖా చూపిస్తాం.
– తిరుపతయ్య, తుంకిమెట్ల
రైతులను మోసం చేస్తున్నది..
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో అన్నదాతలకు మొండి చేయి చూపింది. అత్తెసరు రుణమాఫీలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో పాటు అదునుకందాల్సిన రైతు భరోసా జాడే లేదు. ఎరువులు కొనుగోలుకు, నాట్లు వేసుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్లో పేదలు, కుల వృత్తుల వారిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు పొంతనే లేదు. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బిల్లులపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
– లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కడ్తాల్ మండలం
ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేతలు లేవని స్పష్టమవుతున్నది. రూ. 2 లక్షల 91 వేల 159 కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవడం తప్ప, దళితబంధు పథకానికి నిధులు కేటాయించకుండా దళితులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. పేదరికంలో మగ్గుతున్న వేలాది గిరిజన కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారో స్పష్టత ఇవ్వలేదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదు. పాలమూరు ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం బాధాకరం. పారిశ్రామిక రంగానికీ కంటితుడుపు చర్యగా నిధులు కేటాయించడం విడ్డూరం.
– రాంబల్‌నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, షాద్‌నగర్
బడ్జెట్లో అన్ని వర్గాలకు నిరాశే..
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నిరాశే మిగిల్చింది. ఏ ఒక్క వర్గానికీ సరిగ్గా న్యాయం జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో ప్రతి ఏడాది అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించి అండగా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసింది. రుణమాఫీ విషయంలోనూ ఎంతోమంది రైతులకు అన్యాయం జరిగింది. రైతుభరోసాపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరం.
– కుమ్మరి దర్శన్, తెలంగాణ ఉద్యమకారుడు, షాబాద్
దళితుల ప్రస్తావనే లేదు..
ఆర్థికంగా వెనుకబడిన దళితులను మాజీ సీఎం కేసీఆర్ గుర్తించి దళితబంధు పథకాన్ని తెచ్చి భారీ నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దళితబంధు మాటే ఎత్తకుండా ఏమాత్రం నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసింది. అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తున్నదని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక ఏమీ పట్టనట్లుగా ఉండడం మంచి పద్ధతి కాదు. దళితుల బాగోగులను పట్టించుకోని రేవంత్ సర్కార్‌కు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదు.
-గునిగారి అంజి,మోత్కూర్ గ్రామం, దోమ మండలం
దివ్యాంగులకు అరకొరగా..
బడ్జెట్లో దివ్యాంగులకు అరకొరగా నిధులు కేటాయించిండ్రు. తెలంగాణలో 8 లక్షల దివ్యాంగుల ఓట్లు ఉన్నాయి. పింఛన్లు పెంచుతామని చెప్పి ఓట్లు వేయించుకుని మొండిచెయ్యి చూపిస్తున్నరు. మా ఓట్లేసుకుని గెలిచినోళ్లు మమ్మల్ని మర్చిపోవడం బాధగా ఉన్నది. ప్రజల బాగోగులు చూసుకోలేని చేతకాని ప్రభుత్వమని అర్థమవుతున్నది. పింఛన్లు పెంచుతామని మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడుస్తున్నది. నేటికీ పింఛన్ డబ్బులు అందలేదు. సరైన నిధులు కేటాయించని కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం.
– చెలిమల్ల గోవర్ధన్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామం
పెట్టుబడి సాయానికి నిధులేవీ ?
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎవుసానికి పెట్టుబడి సాయం ఊసెత్తకపోవడం బాధాకరం. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు డబ్బులు ఠంచన్‌గా పడేవి. అదునుకందడం వల్ల వ్యవసాయం పండుగలా సాగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గొప్పలు చెప్పడమే కాని ఇంత వరకు రైతుభరోసానే లేదు. వ్యవసాయ పనులు ప్రారంభంలోనే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకీ రాబోవు రోజుల్లో మేమేంటో చూపిస్తాం.
– బలపాటి నర్సింహులు, బొపునారం, బంట్వారం మండలం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

