2023వ సంవత్సరం వికారాబాద్ జిల్లాకు ప్రగతి నామ సంవత్సరంగా గుర్తుండిపోనున్నది. పాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌ను నిర్మించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల కోసం రూ. వందల కోట్ల నిధులను కేటాయించి పనులను సైతం చేపట్టింది. అంతేకాకుండా జిల్లాకు కొత్తగా వైద్య కళాశాల, మొబిలిటీ వ్యాలీ, నర్సింగ్ కళాశాల, ఆయుష్ దవాఖాన, సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
వైద్య విద్య అందుబాటులోకి రాగా, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను తయారు చేసే మొబిలిటీ వ్యాలీ యూనిట్ ఏర్పాటుతో ఎంతో మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ఏడాదిలో జిల్లా మరింత అభివృద్ధి చెందనున్నదని జిల్లావాసులు ఆశిస్తున్నారు.
– బొంరాస్‌పేట, డిసెంబర్ 31