షాద్‌నగర్‌టౌన్, జూన్ 24 : మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా ఎక్కువగా ఆకర్షించేది యువతనే. అలాంటి యువత ప్రస్తుతం టాటూ(పచ్చబొట్టు)పై మక్కువ చూపుతున్నారు. తమకు ఇష్టమైన పేర్లతోపాటు హీరో పేర్లను, ఫొటోలను, కుటుంబసభ్యులు, దేవుళ్ల ఫొటోలను, చేతి బ్యాండ్ వంటి టాటూస్‌ను వేయించుకుంటున్నారు. ఏదైనా సినిమాలో తమకు ఇష్టమైన హీరో వేసుకున్న టాటూను వేసుకుని కొంత మంది తమ అభిమానాన్ని చాటుకుంటుంటే..మరికొందరు మాత్రం తమ ఇష్టమైన వ్యక్తుల ఫొటోలను, వారి జ్ఞాపకంగా టాటూస్‌ను శరీరంపై వేయించుకుంటున్నారు. యువత అభిరుచులకు తగిన విధంగా టాటూస్ వ్యాపారులు వివిధ ఆకృతలతోపాటు తమ నచ్చిన బొమ్మలను వేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఏది ఏమైనా టాటూస్‌తో న్యూట్రెండ్ మాత్రం మొదలైంది.
టాటూస్ వేయించుకోవడం ఒకప్పుడు మహానగరాలకే పరిమితమై ఉండేది. జిల్లాకేంద్రాలతో పాటు దాదాపు అన్ని పట్టణాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తున్నది. దీంతో పాటు కొందరికి ఉపాధి కూడా దొరుకుతున్నది. ప్రాచీన కాలంలో యుద్ధవీరులు, మల్లయోధులు తమ పటుత్వం గల నరాలపై, మణికట్లపై వివిధ రకాల పచ్చబొట్లను పొడిపించుకునే వారని పురాణాలు చెబుతున్నాయి.
షాద్‌నగర్ పట్టణంలో పలువురు యువత టాటూస్ వ్యాపారంతో జీవనోపాధి పొందుతున్నారు. పట్టణానికి చెందిన నాగరాజు(నిప్పు) అనే యువకుడు గత మూడు సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో టాటూస్‌పై శిక్షణ తీసుకున్నాడు. పట్టణంలోని పద్మావతికాలనీలో ఫ్రెండ్స్ టాటూస్ పేరుతో వ్యాపారాన్ని మొదలు పెట్టి జీవనోపాధి పొందుతున్నాడు. గత మూడేండ్లలో సుమారు 6వేలకు పైగా టాటూస్ వేశాడు. ఒక అంగుళం నుంచి 10 అంగుళాల వరకు టాటూస్ వేసే విధంగా శిక్షణ తీసుకున్నాడు. తన వద్దకు పచ్చబొట్ల కోసం ఎక్కువగా యువత వస్తుంటారని, వారు హీరో ఫొటోలను, పేర్లను, కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలను, దేవుడి ఫొటోలను, ఆయుధాలను పచ్చబొట్టుగా వేసుకుంటున్నారని చెప్పాడు.
నాకు హీరో మహేశ్‌బాబు చాలా ఇష్టం. మహేశ్‌బాబు ఓ సినిమాలో వేసుకున్న టాటూ నచ్చి నేను కూడా వేసుకున్నా. అభిమానంతోనే మహేశ్‌బాబు పేరును టాటూ వేయించుకున్నా. నచ్చిన హీరో పేరును టాటూను వేసుకోవడం సంతోషంగా ఉన్నది.
టాటూస్ వేయడం అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే నేను గత మూడేండ్ల కిందట హైదరాబాద్‌లో టాటూపై శిక్షణ తీసుకున్నా. యువత అభిరుచులకు తగిన విధంగా టాటూస్ వేస్తున్నాను. టాటూ వ్యాపారంతో జీవనోపాధి పొందుతున్నా.
– నాగరాజు(నిప్పు), టాటూ వ్యాపారి షాద్‌నగర్