పెద్దఅంబర్‌పేట, మే 9 : ‘నాన్నా.. సైకిల్ కావాల్సిందే. స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పిస్తానని చెప్తున్నవ్. సెలవులొచ్చినయ్. ఇప్పుడు ఇప్పించకపోతే ఊరుకునేదే లేదు’ ఓ తండ్రికి నాలుగో తరగతి చదివే కొడుకు అల్టిమేటం.‘ఈ సెలవుల్లో కొత్త బ్యాట్, రిమోట్ కారు కావాలి. ఎగ్జామ్ల కంటే ముందు నుంచి రేపు, మాపు అంటున్నవ్. రెండ్రోజుల్లో నాకు కావాల్సిందే’ రెండో తరగతి చదివే కొడుకు డిమాండ్..
ఇది ఓ ఒక్కరు, ఇద్దరికో పరిమితం కాలేదు. దాదాపు పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ‘సెలవుల్లో ఇప్పిస్తానులే. ముందు స్కూల్‌కు వెళ్లు. ఎగ్జామ్స్ బాగా రాయి’ అని సర్దిచెప్పిన యువ తల్లిదండ్రులకు సెలవుల్లో పిల్లల నుంచి ఎదురవుతున్న విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవి. దీంతో పేరెంట్స్ షాపింగ్‌ల బాట పడుతున్నారు. ఏవైనా పెద్ద, ఖరీదైన వస్తువులు అడిగితే చిన్నవాటిని ఇప్పించి సర్దిచెప్పే పనిలో మునిగిపోతున్నారు. చివరకు తప్పేలా లేదు, చలో పోదాం అంటూ కొనుగోలు చేస్తున్నారు. చాలామంది పిల్లలు సైకిళ్లు, క్రికెట్, షెటిల్ బ్యాట్లు, క్యారం, చెస్‌బోర్డులు అడుగుతున్నారు. వీటితోపాటు తల్లిదండ్రులు కథల పుస్తకాలు, గణితం సులువుగా నేర్చుకునేందుకు అవసరమైన పరికరాలు, విజ్ఞానాన్ని పెంచే ఆటలు ఆడుకునేందుకు అవసరమైన వస్తువులు ఇప్పిస్తున్నారు. సెలవుల్లో విజ్ఞానాన్ని పెంచే ఆటలు కూడా ఆడాల్సిందేనని తేల్చిచెబుతున్నారు.
పిల్లలతో సమయం
ఏడాదంతా అడిగిన, కోరిన కోరికలు తీర్చాలని పిల్లలు పట్టుబడుతున్నారు. ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్లను తీర్చుకునేందుకు వెంటపడుతున్నారు. పలానా వస్తువు కావాలని అడగ్గానే.. ఇప్పుడొద్దు, సెలవుల్లో చూద్దాంలే అంటూ సర్ది చెప్పిన మాటలను సాకారం చేయాలని విన్నవిస్తున్నారు. మరోవైపు, యువ తల్లిదండ్రులు సైతం చిన్నారుల కోరికలు తీర్చేందుకు సిద్ధమవుతున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లలు కోరుకున్న వస్తువులతోపాటు వారి జ్ఞానాన్ని పెంచే పరికరాలు కొనుగోలు చేస్తున్నారు.
చిన్నారుల ఇష్టాలకు అనుగుణంగా..
సెలవుల్లో పిల్లల ఇష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు యువ తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలకు ఇష్టమైన ఆట వస్తువులు కొనుగోలు చేసి వారిని సంతోష పెడుతున్నారు. వారితో కలిసి ఆడుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించడం ద్వారా మనస్సును మరింత అర్థం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లల ఇష్టాలను తెలుసుకుని, వారికి నచ్చినట్టు ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోజూ గంట లేదంటే వీకెండ్లో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. ఆటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. పొరపాట్లు చేయకుండా కోచ్‌లుగా మారుతున్నారు. షెటిల్, క్యారమ్ బోర్డు, క్రికెట్, వాలీబాల్, చెస్ వంటివి పిల్లలతో కలిసి ఆడుతున్నారు. పోటీ అంటే ఎలా ఉండాలో వివరిస్తూ.. గెలుపు ఓటములను ఎలా స్వీకరించాలో బోధిస్తున్నారు. వ్యక్తిగా కాకుండా జట్టుగా వెళ్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. జట్టుగా గెలవాలంటే ఎలా ముందుకు వెళ్లాలి, టీంలను ఎలా లీడ్ చేయాలో సూచనలు చేస్తున్నారు.
పొద్దంతా ఆట.. కథలు రాత్రిపూట
సెలవులు కావడంతో చిన్నారుల ఆటలను అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. స్కూళ్ల టైంలో పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతి గది, పుస్తకాలతో కుస్తీలు పట్టారు. ఇప్పుడు సెలవుల్లో ఇంటి ఆవరణలు, మైదానాలే అడ్డాగా ఆడిపాడుతున్నారు. పొద్దంతా స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాత్రిళ్లు పడుకునే సమయంలో చిన్నారులకు కథలు చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. సెల్ఫోన్లను దూరం పెడుతూ.. పుస్తకాలు చేత పడుతున్నారు. కథలు చెప్తూ.. వాటిలో నీతి గురించి వివరిస్తున్నారు. పిల్లలకు నీతి కథలు చెప్తూ.. జీవితంలో ఎలా ఉండాలో సూచనలు చేస్తున్నారు. అందుకోసం కొంతమంది ముందుగానే స్టోరీలు నేర్చుకుంటున్నారు. కథలను ఆసక్తిగా, ఆకట్టుకునేలా చెప్పేందుకు ఇష్టపడుతున్నారు.