Rangareddy | తుర్కయంజాల్, జూన్ 9 : తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ బస్తీ దవాఖానలో గత రెండు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన రమావత్ సరోజను ఉద్యోగానికి రావొద్దంటూ ఇటీవల బస్తీ దవాఖాన డాక్టర్లు చెప్పడంతో ఆమె తన సమస్యను సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణీలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది.
ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. కమ్మగూడ బస్తీ దవాఖానలో హెల్పర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, గడిచిన వారం రోజుల కిందట డాక్టర్లు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని, మరొకరిని ఉద్యోగంలో పెట్టుకుంటున్నట్లు చెప్పారని వాపోయింది. ఉద్యోగాన్ని నమ్ముకోని బతుకుతున్న తనని ఆకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇబ్బందులు పడుతానని జిల్లా వైద్య శాఖ అధికారులు దయతలచి తనని ఉద్యోగంలో కొనసాగించాలని ఆమె కోరింది. తన సమస్యను స్థానిక నాయకులు కందాళ బలదేవరెడ్డి దృష్టికి తీసుకోని వెళ్లానని, ఆయన వెంటనే స్పందించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు రికమెండెషన్ లెటర్ సైతం అందజేశారని, ఆ లెటర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కల్యాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.