ఖైరతాబాద్, సెప్టెంబర్ 20 : అరుదైన వ్యాధిగ్రస్తులకు నిమ్స్ ఆశాదీపంగా నిలుస్తున్నది. జన్యు ల్లో మార్పులు జరిగి అరుదైన వ్యాధులతో పిల్ల లు జన్మిస్తారు. అలాంటి వారికి పూర్తి స్థాయిలో చికిత్సలు ఉండవు. ఈ నేపథ్యంలో వారిని అనుక్షణం పర్యవేక్షిస్తూ చికిత్సలు అందించాల్సి ఉం టుంది. నిమ్స్ దవాఖానలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మెడికల్ జెనెటిక్స్ విభాగా ల్లో అరుదైన వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఈ కేంద్రం పనిచేస్తుంది. ఈ ప్రత్యేక కేంద్రాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డాక్టర్ లీజారాజశేఖర్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్, డాక్టర్ చరణ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
మూడు బెడ్లు.. నిష్ణాతులైన వైద్యులు
నిమ్స్‌లో మెడికల్ జెనెటిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వార్డులో మూడు బెడ్లను ఏర్పాటు చేశారు. మెడికల్ జెనెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ షగున్ అగర్వాల్, అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రజ్ఞా రంగనాథ్ పర్యవేక్షణలో రోగులకు చికిత్స అందిస్తారు. రోగి పూర్తిగా ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అరుదైన వ్యాధిగ్రస్తుల కోసం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చికిత్స సమయాన్ని కేటాయించా రు. మొత్తం 85 మంది రోగులు చికిత్స తీసుకుంటుండగా, వారిలో పదేండ్ల లోపు వారే ఉన్నారు. వారికి కేటాయించిన తేదీల్లో వచ్చి చికిత్స తీసుకొని వెళ్తుంటారు. వ్యాధిగ్రస్తుల నుంచి సేకరించిన రక్త, ఇతర నమూనాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌కు పంపిస్తారు. వ్యాధికి అనుగుణంగా వాడాల్సిన మందులను సైతం నిర్ణయిస్తారు.
రోగులకు రూ.50 లక్షల వరకు ఆర్థిక సాయం
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2021లో రేర్ డీసీజ్ చికిత్స కోసం నేషనల్ పాలసీని తీసుకొచ్చింది. నిర్ణీత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మెడికల్ జెనెటిక్స్ విభాగాల్లో రోగులకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించారు. అరుదైన వ్యాధిగా నిర్ధారణ జరిగిన తర్వాత రోగులకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.20లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఒక్కో రోగి చికిత్సకు కేటాయిస్తారు. ఇప్పటివరకు 55 అరుదైన వ్యాధులకు గుర్తింపు లభించింది.