బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లలో కొందరు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారు. పోలీసుల తనిఖీలో నగరంలో పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రులు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్‌టైం డ్రైవర్లను నియమించుకుని వారి బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది విద్యా సంస్థలు ప్రారంభం కాబోతుండటంతో బస్సులన్నీ ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
– సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్లో 13,502 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 1247, మేడ్చల్- మల్కాజిగిరిలో 6058, రంగారెడ్డిలో 6197 బస్సులు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ ప్రతి స్కూల్ ప్రారంభానికి ముందు రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామక సామర్థ్యం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సు కండిషన్, ఆ బస్సుపై ఉండాల్సిన రంగులు, అక్షరాలు తదితర అన్నీ అంశాలపై సూచనలు ఇస్తారు. ఇప్పటి వరకు సుమారు 3వేల విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి విద్యా సంస్థల బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 30 లోపు ఫిట్నెస్ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు.
వాహనాల చట్టం ప్రకారం 1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2. వ్యాలీడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, 3. వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4. పర్మిట్, 5. ట్యాక్స్ పేమెంట్ రసీదు(బకాయిలు లేకుండా), 6. పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్, 7. డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్స్ తప్పక వాహనంతో ఉండాలి.
పభుత్వ సూచనల మేరకు ఐదు రకాల వాహనా ల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. వాటిలో విద్యాసంస్థల బస్సులూ ఉన్నాయి. ఫిటెనెస్కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాల్సి ఉంటుంది. వాహనం డ్రైవర్ 60 ఏండ్లకు మించి ఉండరాదు. డ్రైవర్‌కు సంబంధించిన ఆరోగ్య వివరాలు బస్సులో అతికించాలి. కనీసం ఐదేండ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి.
పతి వాహనంలోనూ అత్యవసర ద్వారం పెట్టాలి. పెద్ద అక్షరాలతో రాయించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ప్రతి బస్సులోనూ విద్యార్థుల పేర్లు, ఇంటిచిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదే శం పేర్ల పట్టికతోపాటు రూట్ మ్యాప్ తప్పని సరి.