కొండాపూర్, అక్టోబర్ 4: తల్లిపాల ప్రాధాన్యత, తల్లి పాల బ్యాంకింగ్‌పై హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో నిర్వహించిన 6వ ల్యాంబ్కాన్ 2026 అంతర్జాతీయ ఆదివారం ముగిసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కొనసాగిన ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 1,000 మందికి పైగా వైద్యులు, నర్సులు, తల్లిపాల, పోషకాహార నిపుణులు పాల్గొన్నారు. ముగింపుపు రోజున ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణగవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ‘యశోదమ్మ మదర్స్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయయన మాట్లాడుతూ.. నవజాత శిశువులకు సురక్షితమైన దాతృత్వ తల్లి పాలను అందించేందుకు మిల్క్ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
తల్లిపాలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో కీలకమని, మిల్క్ బ్యాంకుల విస్తరణ అంత్యంత ఆవశ్యకమని అన్నారు. అనంతరం యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరంటి రవీందర్ రావు మాట్లాడుతూ.. తల్లి శిశు ఆరోగ్య సంరక్షణకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. తల్లి పాల ఆవశ్యకతపై ప్రత్యేక అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో ‘ఫార్ములా- ఫ్రీహైదరాబాద్’ లక్ష్యంతో డెక్కన్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు.
ప్రతి ప్రసవ కేంద్రంలో తల్లిపాల సలహాదారులు, నవజాత శిశు విభాగాల్లో మదర్స్ మిల్క్ బ్యాంకులు, పని చేసే తల్లులకు అవసరమైన సహకారం అందించాలనే అంశాలను ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మరిన్ని మదర్స్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సుషేన హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ సహకారంతో నగరంలో ఇప్పటికే 10 తల్లి పాల బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయని, యశోద మదర్ మిల్క్ 11వ సెంటర్ గా నిలుస్తుందన్నారు.