మిషన్ పైనజర్
గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
- ఆరు నెలల కాలంలో అస్తవ్యస్తంగా మారిన మిషన్ భగీరథ నిర్వహణ
- రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం
- క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం
- రంగారెడ్డి జిల్లాలో మొదలైన సర్వే.. ఎప్పటికప్పుడు వివరాల నమోదు
- నిధుల కొరత లేకుండా కేంద్ర జలశక్తి నుంచి నిధులు సమీకరించుకునే ఆలోచనలో ప్రభుత్వం!
గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది. ఇక వర్షకాలంలో రోగాలు ముసిరే పరిస్థితులు రానుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలో మిషన్ భగీరథ పథకం వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నది. జిల్లాలో సోమవారం నుంచే సర్వే ప్రారంభమైంది. యాప్ ద్వారా సమగ్ర వివరాలు సేకరించాక.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనున్నది. పథకం నిర్వహణకు నిధుల కొరత రాకుండా అవసరమైతే కేంద్ర జలశక్తి నుంచి నిధులను సమీకరించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
1,072 ఆవాసాలకు కృష్ణా జలాల సరఫరా..
కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన మిషన్ భగీరథ పథకం దిగ్విజయంగా అమలైంది. కేంద్రంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులను సమీకరించి ఈ పథకాన్ని అమలు చేసింది. రూ.476కోట్ల నిధులు వెచ్చించి పనులను చేపట్టగా.. జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఉన్న 1,072 ఆవాసాలకు శుద్ధ జలాలు పంపిణీ అవుతున్నాయి.
శ్రీశైలం బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతంలో ఉన్న యెల్లూరు రిజర్వాయర్ నుంచి సేకరించిన నీటిని ముచ్చెర్ల(కందుకూరు), అంతారం(షాబాద్), కమ్మదానం(షాద్‌నగర్), కల్వకుర్తిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆవాసాలకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి నూతనంగా 877 వాటర్ ట్యాంకులను నిర్మించి 3,236కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. గడపగడపకు నీరందించే ఉద్దేశంతో 2,94,705 నల్లా కనెక్షన్లను సైతం ఏర్పాటు చేశారు.
సాగర్ బ్యాక్ వాటర్ నుంచి తరలివచ్చే నీటి శుద్ధి ప్రక్రియను గత ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టింది. క్లోరినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాకనే స్వచ్ఛమైన నీటిని ఆవాసాలకు సరఫరా చేశారు. అయితే గత ఆరు నెలల కాలంలో పరిస్థితి అంతా తలకిందులైంది. మిషన్ భగీరథ పథకం బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాక.. పథకం నిర్వహణ గాడితప్పింది. నిధుల కొరతతో కనీసం లీకేజీలు, పైపులైన్ మరమ్మతులను చేయడం సైతం ప్రత్యేకాధికారులకు కష్టంగా మారింది. కొన్ని చోట్ల నీరు కలుషితం అవుతుండడం.. వచ్చేది వర్షాకాలం కావడంతో పొంచి ఉన్న రోగాలతో ప్రజానీకం ఆందోళన చెందుతున్నది.
వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకే !..
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నది. వాస్తవానికి మిషన్ భగీరథ పథకంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఏర్పడ్డాయి. పైపులైన్ పనులు, లీకేజీ మరమ్మతు పనులు అస్తవ్యస్తంగా మారాయి. కుళాయిల ద్వారా ఇంటింటికీ సక్రమంగా తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులను సర్వే బృందాలు సమగ్రంగా సేకరించనున్నాయి. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీలు, ఐకేపీ, ఉపాధి హామీ సిబ్బందిని సర్వేలో భాగస్వామ్యం చేస్తున్నారు.
సర్వే సందర్భంగా ఇంటింటికీ వెళ్లి.. కుళాయిలు ఉన్నాయా? ఉంటే సక్రమంగా నీటి సరఫరా జరుగుతున్నదా!.. కుటుంబ అవసరాలకు సరిపడా నీరు సరఫరా అవుతుందా? లేదా!.. పైపు లైన్ లీకేజీలు ఉన్నాయా? వంటి తదితర వివరాలను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను సైతం సేకరిస్తారు. కొత్తగా చేపట్టాల్సిన పనులు, నిధులు ఎన్ని అవసరమో! అంచనా వేస్తారు.
యజమానితో కలిసి ఇంటి ఫొటో, కుళాయి ఫొటోలను సైతం యాప్‌లో అప్లోడ్ చేస్తారు. గ్రామాల వారీగా సేకరించిన సమాచారం మండలాలకు.. ఆ తర్వాత జిల్లాకు చేరుతుంది. వివరాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. సర్వే నిర్వహణపై కొద్దిరోజుల క్రితమే రాష్ట్రస్థాయిలో మిషన్ భగీరథ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోనూ సర్వేలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మిషన్ భగీరథ నిర్వహణకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తున్నది.
జిల్లాలో సర్వే ప్రారంభం..
మిషన్ భగీరథ పథకం వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నది. వివిధ శాఖల సిబ్బంది సోమవారం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉన్నది. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం.
- – సురేశ్‌మోహన్, డీపీవో, రంగారెడ్డి జిల్లా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

