HomeRangareddyMahardasa For 84 Villages With Cancellation Of 111 Go
111 రద్దు ఆకాశమే హద్దు
111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్
111 జీవో రద్దుతో 84 గ్రామాలకు మహర్దశ
హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే ఇక్కడా అమలు
హుస్సేన్‌సాగర్‌లో గోదారమ్మ పరవళ్లు
కాళేశ్వరం జలాలతో జంట జలాశయాల అనుసంధానం
జీహెచ్ఎంసీలో జోన్ల వారీగా డీఎంహెచ్‌వో పోస్టులు
111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ జీవో ఎత్తివేతతో రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల రైతులకు మేలు జరుగనున్నది. ఇక నుంచి అక్కడ కూడా హెచ్ఎండీఏ విధివిధానాలే వర్తించనున్నాయి. జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో అప్పటి సర్కార్ ఈ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం జీవో పరిధిలోని భూమిలో ఎలాంటి వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. 84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూమి ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నది.
ఈ భూములు హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా 111 జీవోతో కేవలం వ్యవసాయ కార్యకలాపాలకే పరిమితమైంది. ఫలితంగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట, హుస్సేన్‌సాగర్‌ను గోదావరి నదితో అనుసంధానానికి, వీటితో పాటు మూసీని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో నగరం నడిబొడ్డున గోదావరి పరవళ్లు తొక్కనున్నది. ‘కొండ’ కెగిసే గోదారమ్మ.. హుస్సేన్‌సాగర్‌ను, అటు జంట జలాశయాలను తరింపజేయనున్నది. విశ్వ నగరానికి సరికొత్త శోభ రానున్నది. అలాగే హైదరాబాద్‌లో జోన్‌కు ఒకటి చొప్పున 6 డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరుకు ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే… చెంతనే ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం ఆ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. రెండున్నర దశాబ్దాలకుపైగా 111 జీవో గ్రహణంతో అభివృద్ధి అనేది అందని ద్రాక్షగా మారిన 84 గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపింది. 111 జీవో ఉద్దేశానికి ఏమాత్రం విఘాతం కలగకుండా… అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఆ జీవో పరిధిలోని గ్రామాల్లో కూడా హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాల మాదిరిగానే అభివృద్ధి ఫలాలు అందేలా 111 జీవోను ఎత్తివేస్తూ గురువారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల పరిధిలోని ప్రజల్లో అభివృద్ధి ఆశలు చిగురించాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. కానీ… నగరానికి చెంతనే ఉన్నా, 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం ఈస్థాయి అభివృద్ధి వెలుగులు ప్రసరించలేకపోతున్నాయి. భూమి విస్తీర్ణంలో కేవలం పది శాతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, జీ+2 వరకు మాత్రమే నిర్మాణాలకు అనుమతుల వంటి నిబంధనలతో రెండున్నర దశాబ్దాలకు పైగా ఆ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రత్యేక ని‘బంధనాల’ నుంచి విముక్తిని పొందాయి.
111 జీవో వెనక కథ…
అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం మీదుగా కృష్ణమ్మ ఒడికి చేరుకునే మూసీ 1908లో చూపిన ఉగ్రరూపంతో తదుపరి వరద నియంత్రణకు నిజాం జంట జలాశయాలను నిర్మించారు. మూసీపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), ఈసీపై హిమాయత్‌నగర్ జలాశయాల నిర్మాణంతో వరదలను నియంత్రించడంతో పాటు జంట నగరాలకు తాగునీటిని కూడా అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనంతరం దశాబ్దాల పాటు ఈ జంట జలాశయాలు, జంట నగరాల్లోని ప్రజల దాహార్తిని తీర్చాయి. ఈ నేపథ్యంలో ఈ జలాశయాల పరిరక్షణకు 1996, మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111 జారీ చేసింది. రెండు జలాశయాల పరివాహక ప్రాంతాలు పది కిలోమీటర్ల రేడియస్‌లో 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాలు కేవలం వ్యవసాయ, వినోద జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొంది.
నిలిచిన అభివృద్ధి…
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధి నలువైపులా విస్తరించినప్పటికీ… నగరానికి నైరుతిలో ఉన్న ఈ 84 గ్రామాల్లో మాత్రం విస్తరణ నిలిచిపోయింది. ప్రధానంగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లోని సంస్థల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని దాటి అభివృద్ధి విస్తరించింది. మరోవైపు రియల్ రంగం అనేది హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల మేర విరాజిల్లుతున్నా… జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం విస్తరించలేకపోయింది. నగరం చుట్టూ ఉన్న భూముల రేట్ల ప్రకారం బేరీజు వేస్తే… ఇతర ప్రాంతాల్లో పది అంతకంటే రెట్ల విలువలు ఉన్నాయి.
హైదరాబాద్‌కు భరోసా కల్పించి…
జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా ఉండేది. ఉస్మాన్‌సాగర్ నుంచి 15 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 22 ఎంజీడీలు వచ్చేవి. గతంలో ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా లేకుంటే నగరం అల్లాడిపోయేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్ తాగునీటి సరఫరాకు రానున్న దశాబ్దాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. కృష్ణా నది నుంచి మూడు దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేలా సుంకిశాల పథకాన్ని పూర్తి చేస్తున్నారు. గోదావరి తాగునీటి పథకం ద్వారా రోజుకు 170 మిలియన్ గ్యాలన్ల గోదావరిజలాలు వస్తున్నాయి. సింగూరు-మంజీరా నుంచి రోజుకు 93 మిలియన్ గ్యాలన్లు… ఇలా జంట జలాశయాల నుంచి కాకుండానే నగరానికి రోజుకు 533 మిలియన్ గ్యాలన్ల తాగునీరు ఎలాంటి ఢోకా లేకుండా వస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో అటు కృష్ణా… ఇటు గోదావరి నుంచి పుష్కలమైన నీటి లభ్యత ఉండటంతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా వందేండ్లకు కూడా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ఢోకా ఉండదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్…
84 గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అందుకుగాను అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. 111 జీవో ఉద్దేశమైన జంట జలాశయాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి… గత ఏడాది ఏప్రిల్ 20న జీవో 69 జారీ చేశారు. ఆ మేరకు జలాశయాల పరిరక్షణకు రూ.960 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, చుట్టూ ట్రంక్మెయిన్ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకూ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఆ జలాశయాల పరిరక్షణకు కూడా మార్గం సుగమమైంది.
111 జీవో ఎత్తివేతతో ఇవీ ప్రయోజనాలు…
84 గ్రామాల పరిధిలో 111 జీవో ఎత్తివేతతో నగరానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అభివృద్ధి పరుగులు పెడుతుంది.
హెచ్ఎండీఏ పరిధిలో ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయో అవే ఇక్కడ కూడా అమలు కానున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగానికి సులభతరంగా అనుమతులు వస్తాయి.
వ్యవసాయ, వినోద జోన్లకు మాత్రమే పరిమితమైన ఈ భూములు అన్ని జోన్ల పరిధిలోకి వస్తాయి. రైతులు తమ భూముల్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు వస్తుంది. తద్వారా భూముల విలువ ఇప్పటికంటే అనేక రెట్లు పెరుగుతుంది.
నగరానికి చేరువలో ఉండటంతో ఆంక్షల ఎత్తివేతతో నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఈ గ్రామాలు వేదికగా మారి అనేక కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు వస్తాయి. ఆకాశహర్మ్యాలు వెలుస్తాయి.
పెట్టుబడులకు కేంద్రంగా మారడంతో ఇతర అన్ని రకాల మౌలిక వసతులు ఆ ప్రాంతాల్లోకి వస్తాయి.
ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రజల బాధలు ప్రభుత్వం అర్థం చేసుకున్నది..
111 జీవో ప్రజలకు పెద్ద గుదిబండగా ఉండేది. దీంతో 84 గ్రామాల ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి పనులు చేయాలన్నా.. నిర్మాణాలు చేపట్టాలన్నా 111 జీవో నిబంధనలు ఆటంకంగా మారాయి. అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా కొనుగోలుదారులు తక్కువ ధరలకు అడిగేవారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుని. అన్ని రకాలుగా న్యాయ నిపుణులు, సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తరువాత జీవో 111 ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో 84 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని పేదల పెన్నిధిగా మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడి ప్రజలందరం ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-కె శ్రీనివాస్, సర్పంచ్ తోలుకట్టా, మొయినాబాద్
మరో గచ్చిబౌలిగా చేవెళ్ల
111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలకు సంతృప్తికరమైన ప్రకటన రాబోతున్నది. జంట జలాశయాలకు ఎలాంటి ముప్పువాటిళ్లకుండా, పర్యావరణంపై ప్రభావం లేకుండా జీవో ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంటాం. జీవో ఎత్తివేతతో చేవెళ్ల ప్రాంతం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. చేవెళ్ల ప్రాంతం మరో గోపన్‌పల్లి, గచ్చిబౌలి కానున్నది.
మీ బిడ్డగా చెప్తున్న. ఎవరూ భూములు అమ్ముకోవద్దు. ఇక్కడ ఐటీ పరిశ్రమలు, పొల్యూషన్ లేని పరిశ్రమలు రావాలె అని చెప్పారు. అవసరం లేకపోయినా అనేక గ్రామాల్లో 111 జీవో అమలవుతున్నది. పోయినసారే చేద్దామనుకున్న.. కానీ ఈ జీవోను ఎత్తివేసి కేసీఆర్, యాదయ్య కలిసి వంద కోట్లు తిన్నరంటరు.. బద్నాం ఎందుకని చేయలే.. కానీ ప్రామిస్ చేస్తున్న, మీకు శాపమైన 111 జీవోను ఎత్తివేస్త..
– 2018 డిసెంబర్ 3,5న చేవెళ్ల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్
2019 ఏప్రిల్ 9న వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి దగ్గట్టుగానే నేడు జీవో రద్దు చేసి నిరూపించారు.
111 జీవో రద్దు చరిత్రాత్మకం…
చాలా ఏండ్లుగా రైతులను ఇబ్బందులు పెడుతున్న 111 జీవోను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. శంకర్పల్లి మండలంలో కొన్ని గ్రామాలు 111 ఉండడం వల్ల భూముల విలువలు చాలా తక్కువగా ఉండేవి. ఈ నిర్ణయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
-బొల్లారం వెంకట్‌రెడ్డి, 111 జీవో రద్దు సమితి జిల్లాఅధ్యక్షుడు
ఏండ్ల కల నేరవేరింది
ఏండ్ల కాలం నుంచి అభివృద్ధికి అడ్డుగా ఉన్న జీవో 111ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తివేయడంతో ఇక్కడి ప్రజల ఏండ్ల కల నేరవేరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– దండుఇస్తారి, సర్పంచ్ సుల్తాన్‌పల్లి
మాకూ లోన్లు వస్తాయి
ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే జీవో 111 నిబంధనలు అడ్డువచ్చేవి. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేమని చెప్పేవారు. నిర్మాణాలు చేపట్టినా గ్రామ పంచాయతీలు అనుమతులు ఇచ్చేది కాదు. జీవో 111 ఎత్తి వేస్తూ కేబినేట్లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం.
– సీహెచ్ కృష్ణారెడ్డి, శ్రీరాంనగర్, మొయినాబాద్
భూముల ధరలు పెరుగుతాయి
గత ప్రభుత్వాలు జీవో 111 పేరుతో ఆంక్షలు విధించడంతో మా భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. నిర్మాణాలు చేయడానికి అనుమతులు లేవు. సీఎం కేసీఆర్ సార్ నిర్ణయంతో మా భూముల ధరలు పెరుగుతాయి.
– రూప్లానాయక్, రైతు పెద్దషాపూర్
గొప్ప నిర్ణయం..
111 జీవోపై గతంలో మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇది శుభపరిణామం. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
– వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు