ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది హెచ్ఎండీఏ. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో
అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
-సిటీబ్యూరో,మే15(నమస్తే తెలంగాణ)
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్పై అత్యధికంగా గచ్చిబౌలి- శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలోనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, తెలంగాణ పోలీస్ అకాడమీ ఇంటర్‌చేంజ్‌ల మీదుగా నానక్‌రాంగూడ టోల్ ఫ్లాజా దాటిన తర్వాత ఉన్న ఔటర్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వద్ద కిందకు దిగుతున్నాయి. ఇదే సమయంలో రాయదుర్గం, ఖాజాగూడ, విప్రో జంక్షన్, నానక్‌రాంగూడ విలేజ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వద్ద నిలిచిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి హెచ్ఎండీఏ అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దాటగానే కొత్తగా కిందకు దిగడానికి ఒక ర్యాంపు నిర్మాణ పనులు చేపట్టారు.
నార్సింగి-నానక్‌రాంగూడ ప్రాంతాల మధ్య ఉన్న సర్వీసు రోడ్డును కలుపుతూ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రెండు చోట్ల కొత్తగా లింకు రోడ్లను ఇటీవలే జీహెచ్ఎంసీ నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. గౌలిదొడ్డి, క్యూసిటీ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ మీదుగా వచ్చే రోడ్డు వేవ్‌రాక్ నుంచి నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా సమీపంలోని సర్వీసు రోడ్డును కలిసేలా అనుసంధానమై ఉంది. ఈ రోడ్డును పరిగణలోకి తీసుకున్న హెచ్ఎండీ అధికారులు శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోకి వెళ్లాలంటే నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు వెళ్లకుండా అంతకు ముందు కొత్తగా ఏర్పాటు చేసే దిగువ ర్యాంపు మీదుగా వాసవి జీపీ ట్రెండ్స్, వన్ వెస్ట్ టర్మినస్ టవర్ల మధ్య ఉన్న లింకు రోడ్డు మీదుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ కంపెనీలకు, ఆ తర్వాత అదే మార్గంలో క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, నల్లగండ, తెల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లేలా రోడ్డు అందుబాటులో ఉందని, దీంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ మీదుగా ట్రాఫిక్‌తో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ రెండు ఫ్లై ఓవర్లను నిర్మించి ప్రారంభించగా, మరో రెండు ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో కొంత మేర ట్రాఫిక్ సమస్యలు తగ్గినా, నానక్‌రాంగూడలో తీవ్ర రూపం దాల్చాయి. నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కొత్తగా నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా దాటిన వెంటనే వాహనాలకు సర్వీసు రోడ్డులోకి వచ్చేలా కొత్తగా దిగువ ర్యాంపును నిర్మిస్తున్నారు. దీంతో టోల్‌ఫ్లాజా దాటిన వెంటనే వాహనాలు ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ఫైనాన్సియల్ డిస్ట్రిక్,పుప్పాల్‌గూడ, విప్రో జంక్షన్, కోకాపేట, యూఎస్ కాన్సులేట్ భవనం వైపు వెళ్లేందుకు వీలవుతుంది.