సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నగరానికి పడమర దిక్కున ఉన్న మూసీ ఆకాశహర్మ్యాలకు నిలయంగా మారుతున్నది. హైదరాబాద్ మహానగరంలో ఐటీరంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో అదే స్థాయిలో వెస్ట్‌జోన్ పరిధిలోనూ ఆకాశమే హద్దు అన్నట్లు అభివృద్ధి జరు గుతున్నది. 10 నుంచి 58 అంతస్తులు కలిగిన బహుళ అంతస్తుల భవనాలు కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో వందకు పైగా ఉన్నాయి. అదేవిధంగా 30కిపైగా హైఎండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులున్నాయి. దీంతో ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన గండిపేట నుంచి మొదలయ్యే మూసీ తీరమంతా సరికొత్తగా రూపాంతరం చెందుతున్నది. అందుకు నిదర్శనం… తాజాగా మూసీ తీరంలో నార్సింగి ఔటర్ రింగురోడ్డు బ్రిడ్జి సమీపంలో 14 ఎకరా ల్లో 40 అంతస్తుల చొప్పున నాలుగు టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఐరా బిల్డర్స్ సంస్థ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది.
2,400 కుటుంబాలు నివాసముండేలా అత్యాధునిక మౌలిక వసతులతో నాలుగేండ్లలో పూర్తయ్యేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. ఔటర్ రింగు రోడ్డు నార్సింగి జంక్షన్ నుంచి గండిపేట వైపు ఉన్న మూసీకి ఇరువైపులా ఇదే తరహాలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. కొండలు, గుట్టలతో కూడిన ఈ ప్రాంతమంతా ఇప్పుడు ఆధునిక నివాసాలకు కేంద్రంగా మారుతున్నది. 4-5 ఎకరాల నుంచి మొదలు కొని 10-20 ఎకరాల్లో హౌసింగ్ ప్రాజెక్టులు ప్రస్తుతం పదుల సంఖ్యలో వెలిశాయి. రానున్న నాలుగు, ఇవ న్నీ పూర్తయితే నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గండిపేట జలాశయం వరకు ఉన్న మూసీనది సరికొత్త అందాలకు నిలయంగా మారనున్నది.
భారీ నిర్మాణ రంగ సంస్థల క్యూ ..
నార్సింగి నుంచి శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా మంచిరేవుల, కోకాపేట, గండిపేట ప్రాంతాలున్నాయి. ఇవి గత మూడు, నాలుగేండ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోనివి. నానక్‌రాంగూడ, పుప్పాల్గూడతోపాటు కోకాపేటలో భారీ ఎత్తున నిర్మాణాలు వెలిశాయి. ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు లేకపోవడంతో కోకాపేట దాటి నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల్లో తమ భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు బిల్డర్లు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు ఐటీకారిడార్‌లో భాగమయ్యాయి. జూబ్లీహిల్స్-మాదాపూర్ నుంచి మొదలయ్యే ఐటీ కంపెనీల విస్తరణ రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్ మీదుగా నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, మణికొండ, కోకాపేట వరకు విస్తరించింది. తాజాగా 40-50 బహుళ అంతస్తుల ప్రాజెక్టులతోపాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లాల ప్రాజెక్టులు సైతం కోకాపేట, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి.