నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కుట్టుమిషన్ శిక్షణనిస్తూ స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహిస్తున్నది. ఒక్కో బ్యాచ్‌లో 30మందికి 90రోజులపాటు శిక్షణ ఇస్తున్నది. అంతేకాకుండా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికెట్లతోపాటు ఉచితంగా కుట్టుమిషన్లనూ పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు 200లకు పైగా యువతులు, మహిళలు శిక్షణ పూర్తి చేశారు. ఆసక్తికలిగినవారు మండల పరిషత్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని న్యాక్సంస్థ అధికారులు తెలిపారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 14 : మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు న్యాక్ సంస్థ మహిళలు, యువతులకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. 30 మంది బృందంగా 90 రోజులపాటు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ ఇస్తూ శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు ఉచితంగా కుట్టుమిషన్‌ను అందించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతున్నది. ఈ కార్యక్రమాన్ని న్యాక్ సంస్థ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగిస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 200లకు పైగా యువతులు, మహిళలకు న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేసి ఉచితంగా కుట్టుమిషన్లను అందజేసినట్లు న్యాక్ టీటీఎస్ అసిస్టెంట్ జిల్లా డైరెక్టర్ నిజలింగప్ప తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధికి కుట్టుమిషన్వైపు దృష్టిని సారిస్తున్నారు. ఈ తరుణంలో న్యాక్ సంస్థ బీవోసీడబ్ల్యూతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కింద యువత, మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
90 రోజులపాటు శిక్షణ..
న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 90 రోజులకు ఒక్క బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నారు. అందులో 30 మంది మహిళలు, యువతులు ఉంటారు. శిక్షణ పొందాలనేకునేవారు స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆధార్‌కార్డు, ఓటరు ఐడీ, పాస్ పోర్టు సైజు ఫొటో ఇచ్చి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అందులో చేరాలనుకునే మహిళల భర్తలు తప్పనిసరిగా లేబర్ కార్డు పొంది ఉండాల్సి ఉంది. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో సంబంధిత స్టేషనరీని న్యాక్ సెంటర్వారే అందిస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టుమిసన్ శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఎక్కడైనా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో సంబంధిత ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతుందని న్యాక్ సంస్థ అధికారులు తెలిపారు.
కుట్టుమిషన్‌తో పాటు వివిధ రంగాల్లో ట్రైనింగ్..
లేబర్‌కార్డు కలిగి ఉన్నవారి పిల్లలకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శిక్షణతో పాటు మేస్త్రీ, పెయింటింగ్, కార్పెంటర్, టైల్స్, ప్లంబర్‌తో పాటు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. వీరికి 15 రోజుల శిక్షణతో పాటు 3నెలల శిక్షణ రెగ్యులర్ ట్రైనింగ్ కింద రెండు విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకాలం పూర్తయ్యాక లేబర్కార్డుతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ట్రేడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. శిక్షణ కాలంలో ఉదయం, సాయంత్రం టీ, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, హెల్మెట్, షూ తదితర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు.
ఎస్సీ మహిళలు, యువతులకు ప్రత్యేక అవకాశం..
న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పోరేషన్ అనుసంధానంతో జిల్లాలోని ఎస్సీ మహిళలు, యువతులకు ప్రత్యేక కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా కల్పించనున్నారు. 90 రోజులపాటు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ మహిళలు, యువతులకు సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా కుట్టుమిషన్ అందజేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఎస్సీ మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 40మంది ఎస్సీ మహిళలకు సర్టిఫికెట్లు, ఉచితంగా కుట్టుమిషన్లను అందించారు. చేవెళ్ల తదితర మండలాల్లో కూడా ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, మిషన్లు అందించనున్నట్లు తెలిపారు.
మంచి స్పందన లభిస్తున్నది..
న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణకు ప్రారంభంలో సరైన అవగాహనలేక మహిళలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం జిల్లాలో మహిళల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రతి బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తున్నాం.
– వసంత, సీనియర్ ట్రైనర్, న్యాక్సంస్థ
ఆసక్తిగలవారు సద్వినియోగం చేసుకోవాలి..
న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా అందజేస్తున్న ఈ శిక్షణను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగపర్చుకోవాలి. ఉచిత శిక్షణ అనంతరం అందజేస్తే సర్టిఫికెట్ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. జిల్లాలోని అన్ని మండలాల్లో న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసక్తిగలవారు 30మంది గ్రూపుగా ఏర్పడితే సెంటర్‌ను ఏర్పాటు చేసి శిక్షణ అందజేస్తాం.
– నిజలింగప్ప, న్యాక్ టీటీఎస్ అసిస్టెంట్ జిల్లా డైరెక్టర్