కొడంగల్, డిసెంబర్ 25 : దీక్ష, ఏకాగ్రత, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని, వ్యర్థాలను కూడా కళాఖండాలుగా తీర్చిదిద్దవచ్చని అశోక్ నిరూపిస్తున్నాడు. సుద్ద ముక్క, బొగ్గు, విత్తనాలు, వ్యర్థాల తో సూక్ష్మకళలను సృష్టిస్తూ.. అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. విభిన్నమైన చిత్ర కళారంగంలో రాణిస్తూ.. రికార్డులు, అవార్డులు, సత్కారాలు, ఎన్నో బహుమతులను అందుకొన్నాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సున్నపు ఆశప్ప, సున్నపు నర్సమ్మల ఏకైక కుమారుడు సున్నపు అశోక్.
అశోక్‌కు చిన్ననాటి నుంచి చిత్రకళపై మక్కువ. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకు చదువుకొని, 6 నుంచి 10వ తరగతి వరకు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలోని కళాశాలలో ఇంటర్ వరకు చదువుకొని హైదరాబాద్‌లో టీటీసీ శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆర్థిక స్థోమత కారణంగా డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాడు. చిత్రకళపై తనకున్న మక్కువతో 3వ తరగతి నుంచే చిన్న చిన్న బొమ్మలు వ్యర్థాలతో బొమ్మలను తయారు చేస్తూ.. కళకు పదును పెట్టాడు.
వివిధ ఆకృతుల తయారీ..
అశోక్ తనదైన శైలిలో సుద్దముక్కలు, చింత గింజలు, కంది పప్పు, వాడేసిన కొబ్బెరి చిప్పలు, కోడిగుడ్లు, బియ్యం గింజలు, వాడేసిన విద్యుత్ బల్బ్‌లు, అగ్గిపుల్లలు ఈ విధంగా అనేక వ్యర్థాలతో పలు ఆకృతులను ఆవిష్కరించి అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. చింత గింజలపై వివిధ నాయకులు, దేవుళ్ల బొమ్మలు చెక్కడం. కంది పప్పు గింజలతో ఆంగ్ల అక్షరాలు, ఐస్‌క్రీం, అగ్గిపుల్లలతో చారిత్రక కట్టడాలను నిర్మించాడు.
ప్రశంసలు.. సన్మానాలు..
విభిన్నమైన చిత్ర కళారంగంలో రాణిస్తున్న అశోక్ కృషిని గుర్తించిన మేజిక్ బుక్ఆఫ్ రికార్డు హర్యానా సంస్థ ఆధ్వర్యంలో గౌరవ డాక్డరేట్ అందుకున్నాడు. ఏకే తెలుగు మీడియా ముం బాయి వారు ఉత్తమ చిత్రకారుడి అవార్డును అందించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, మహాత్మాగాంధీ అంతర్జాతీయ నోబె ల్ శాంత అవార్డు, స్వామి వివేకానంద జాతీయ యువ పురస్కారం, నవభారత్ రాష్ట్రీయ జ్ఞాపిట్ అవార్డు, ఇంటర్నేషనల్ యూత్ అవార్డు, పీవీ నర్సింహారావు ప్రైడ్ ఇండియా అవార్డు, జాతీయ శివ నంది అవార్డు అందుకున్నాడు. దీంతో పలువురు అశోక్‌ను అభినందిస్తున్నారు.
ఆర్థిక స్థోమత లేక ఫైన్ ఆర్ట్స్ విద్య చదవలేక పోయాను..
పేద కుటుంబం, ఆర్థిక స్థోమత లేని కారణంగా చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ ఫైన్ ఆర్ట్స్‌లో చేరలేకపోయా. ఎవరి వద్ద చిత్రకళను అభ్యసించలేదు. ఎన్నో అవార్డు, బహుమతులు, ప్రశంసా పత్రాలు, సత్కారాలు అందుకున్నా. కానీ గిన్సిస్ బుక్‌లో నమోదు కావాలనే కోరిక మిగిలింది. ప్రస్తుతం గ్రామంలో ఉంటూ బోర్డ్స్ పెయింటింగ్ చేసుకొని కుటుంబానికి ఆసరాగా ఉన్నా.
– సున్నపు అశోక్, యాంకి, దౌల్తాబాద్ మండలం, కొడంగల్