వేసవి దుక్కులతో.. లాభాలెన్నో..!
వేసవి దుక్కులతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాముల సంతతి పెరుగుతుంది. తద్వారా భూసార అభివృద్ధికి తోడ్పడుతుంది.
- ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి
- వానకాలం పంటల సాగుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు
- అన్నదాతలకు సలహాలు ఇస్తున్న వ్యవసాయాధికారులు
షాబాద్, మే 6 : వేసవి దుక్కులతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాముల సంతతి పెరుగుతుంది. తద్వారా భూసార అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేగాక కలుపు మొక్కలు, చీడపీడలను నివారించవచ్చు. పంటల సాగు పూర్తయ్యాక రైతులు తమ వ్యవసాయ భూములను అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి భూమిలోని పోషకాలు స్వీకరించడమే కాకుండా భూమిలో లోతైన పొరల నుంచి నీటిని లాగేస్తాయి. దీంతో భూమిలోని సారం దెబ్బతిని ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రైతులు యాసంగి పంటలు చేతికందగానే దుక్కులను దున్ని భూములను ఆరబెట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
కలుపు మొక్కల నివారణ..
భూముల్లో ఏ పంట వేయకుండా ఉంచడంతో కలుపు మొక్కలు పెరిగి భూసారానికి నష్టం కలుగజేయడంతో పాటు చీడపీడలకు ఆశ్రయం కల్పిస్తాయి. మొండి జాతికి చెందిన తుంగ అన్ని రకాల భూముల్లోనూ ఎదుగుతుంది. బహు వార్షిక వేర్లల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుని భూసారాన్ని దెబ్బతిస్తున్నది. వేసవిలో లోతైన దుక్కులు దున్నడం వల్ల వీటిని నివారించవచ్చు. పంట కాలం ముగిశాక భూములను ఖాళీగా ఉంచడం వల్ల పంటలను ఆశించే చీడపురుగులు, తెగుళ్లును కలుగజేసే శిలీంధ్రాలు భూమి పొరల్లో ఆశ్రయం పొందుతాయి. దుక్కులు దున్నడం వల్ల వెలుపలికి వచ్చి బయటి ఉష్ణోగ్రతలకు చనిపోతాయి.
వర్షాకాలానికి ముందే దుక్కులు దున్నాలి..
వర్షాకాలం రాకముందే భూమిని మూడు దుక్కులు దున్నాలి. ఇలా చేయడం వల్ల తొలకరి వర్షాలకు నేల మెత్తబడి నీళ్లు భూమిలోకి ఇంకుతాయి. దుక్కులు లోతుగా, వాలుగా, అడ్డంగా దున్నుకుంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకి తేమను నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. దుక్కి దున్ని భూమిని ఎండబెట్టడం ద్వారా కలుపు మొక్కలను నివారించవచ్చు. దుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల పేడ, కంపోస్టు ఎరువులు వేయాలి. దీంతో భూమిలో సారవంతం అవడమే కాకుండా తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
వానకాలం దుక్కులు సిద్ధం చేసుకోవాలి
భూములను వృథాగా వదిలివేయడం వల్ల పొరలు గట్టి పడతాయి. పంటలు వేసిన సమయంలో విత్తనం సరిగ్గా చొచ్చుకునిపోదు. దీంతో పోషక పదార్థాలు సరిగా అందక మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. వేసవిలో లోతుగా దుక్కిదున్నడం వల్ల భూమి బలంగా మారుతుంది. దీంతో భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడమే కాకుండా తేమలో జీవించే సూక్ష్మజీవులు, వానపాములు సంతతి వృద్ధి చెందుతుంది. ఇవి భూసార అభివృద్ధికి తోడ్పడతాయి. రైతులు వానకాలం పంటల సాగుకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవాలి.
– వెంకటేశం, ఏవో షాబాద్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

