వికారాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూవాడా.. ఒక్కటై కదిలి విజయవంతం చేద్దామని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ముఖ్య నాయకులు, తాండూరు, పరిగి మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ము ఖ్యంగా యువకులు భారీగా వచ్చేలా మండలాల వారీ గా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అయితే, జిల్లా నుంచి వరంగల్ రజతోత్సవ సభకు 180-200 బస్సులతోపాటు నాయకుల సొంత వాహనాల్లోనూ తరలివెళ్లనున్నామన్నారు. సభకు వెళ్లే ముందు గ్రామాలు, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం చలో వరంగల్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజూగౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు చెందిన అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అన్నింటిలోనూ విఫలమే..
కాంగ్రెస్ సర్కార్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి.. కేసులకు ఎవరూ భయపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను మనమే కైవసం చేసుకుంటాం. అదేవిధంగా పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఊరూరా పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలి. సభకు వెళ్లే ముందు పార్టీ జెండాలను అన్ని గ్రామాలు, వార్డుల్లో ఎగురవేయాలి.
నియోజకవర్గం నుంచి 5000 మంది..
వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 5,000 మంది నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాం డూరు నియోజకవర్గాల నుంచి సుమారుగా 15,000 మంది సభకు తరలివెళ్లేలా బస్సులు, ఇతర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు అధికంగా తరలివచ్చేలా మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నాం. పార్టీ ఏర్పాటై 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా కార్యకర్తలందరూ భారీగా తరలివచ్చి వరంగల్ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నది. ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే