సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Jan 18, 2020 , 00:54:34

సరైన పద్ధతిలో తీసుకోకుంటే అనర్థాలు

సరైన పద్ధతిలో తీసుకోకుంటే అనర్థాలు


నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: నేటి ఉరుకులు, పరుగుల జీవిత ప్రయాణంలో బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు మధుమేహ బాధితులు, ముఖ్యంగా టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాధి వచ్చిన ఒకటి రెండు నెలల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు. ఈ క్రమంలో 1922, జనవరి 11న కెనడా దేశంలోని టొరం టో జనరల్‌ హాస్పిటల్‌లో మొట్టమొదటి సారిగా ఒక మధుమేహ బాధితుడికి విజయ వంతంగా ఇన్సులిన్‌ను ఇంజక్షన్‌ ద్వారా ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడడం జరిగిందని, దీనిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 11నుంచి వారం రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ డే’ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఉస్మానియా దవాఖాన ఎండో క్రినాలజి విభాగం అధిపతి ప్రొ.రాకేష్‌ సహాయ్‌ తెలిపారు. ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ డే వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బేగంపేటలోని హోటల్‌ మ్యారీ గోల్డ్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎండోక్రిన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్య క్షులు, హర్యానాకు చెందిన వైద్యనిపుణులు డా.సంజయ్‌ కాల్డాతో కలిసి ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకునే పద్ధతులను ఆయన డా. సహాయ్‌ వివరించారు. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను నియం త్రించి రోగిలో మధుమేహం వ్యాధిని అదుపులో ఇంచేందుకు ఇన్సులిన్‌ ఎంతో అవసర మని వారు తెలిపారు. అయితే సరైన పద్ధతిలో ఇన్సులిన్‌ను తీసుకోకపోతే అటు శరీరంలో ఉన్న వ్యాధి తగ్గకపోగా కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

 ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం


మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ థెరపి తప్పనిసరని అయితే వారిలో ఈ థెరపీని సరైన పద్ధతిలో తీసుకోకపోతే ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డా. రాకేష్‌ సహాయ్‌, డా.సంజయ్‌ కాల్డా హెచ్చరించారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవాల్సి వస్తుందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ సరైన పద్ధతిలో తీసుకోకుంటే ‘లిపోహైపర్‌ ట్రోఫీ’(ఇంజక్షన్‌ తీసుకున్న చోట చర్మం కింద మందం కావడం, వాపు రావడం) అనే సమ స్య ఎదురయ్యే ప్రమాదముందని వారు వివరించారు. దీనివల్ల తీసుకున్న ఇన్సులిన్‌ సైతం సరిగ్గా పనిచేయక వ్యాధి ముదిరే అవకాశముందన్నారు. ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ను రోగులే స్వయంగా తీసుకోవడం జరుగుతుందని ఈ క్రమంలో ఇంజక్షన్‌ తీసుకోవడంపై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరన్నారు.

ఇన్సులిన్‌  తీసుకునే పద్ధతులు


ఇన్సులిన్‌ తీసుకోవడంలో 5  పద్ధతులను పాటించాలని వైద్యులు సూచించారు.  1.సైట్‌ రొటేషన్‌ 2. ఫ్రెష్‌ నీడిల్‌ 3.లిపో హైపర్‌ ట్రోఫీ 4.ఇంజక్షన్‌ సైట్‌ 5. కరెక్ట్‌ నీడిల్‌ లెంత్‌
సైట్‌రొటేషన్‌: సాధారణంగా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ను తొడలు, పొత్తికడుపు, చేతులు, పిరు దులపై తీసుకుంటారు. అయితే ఇంజక్షన్‌ థెరపీలో రొటేషన్‌ పద్ధతిలో ఇంజక్షన్‌ తీసుకునే శరీర భాగాన్ని మార్చాలి. అంటే మొదటి రోజు ఎడమ కాలు తొడపై తీసుకుంటే రెండవ రోజు కుడికాలు, మూడవ రోజు కుడిచేయి, నాలుగవ రోజు ఎడమ చేయి ఇలా రొటేషన్‌ పద్ధతిలో తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఫ్రెఫ్‌ నీడిల్‌: ఒకసారి వాడిన నీడిల్‌ను రెండవ సారి వాడకూడదు. ప్రతిసారి కొత్త సూదిని వాడడం ఉత్తమమం
లిపో హైపర్‌ ట్రోఫి: ఇంజక్షన్‌ తీసుకున్న ప్రదేశాన్ని ప్రతి విజిట్‌లో క్షుణ్ణంగా పరిశీలించాలి. వైద్యుడిచే టెస్ట్‌ చేయించాలి. దీనిపై రోగులకు వైద్యులు అవగాహన కల్పించాలి. ఇంజక్షన్‌ తీసుకున్న చోట వాపు లేదా ఇతర చర్మ సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని బాధితులకు సూచించాలి.
ఇంజక్షన్‌ సైట్‌: ఇంజక్షన్‌ చేసే సమయంలో చేతులను శుభ్రం చేసుకోవాలి. అంతే కాకుండా ఇంజక్షన్‌ చేసే ప్రదేశాన్ని కూడా శుభ్రపర్చాలి. ఇంజక్షన్‌ ఇవ్వడానికి ముందు ఇవ్వాల్సిన చోట గాయాలు, పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. అలాంటి ఏవైన ఉంటే అక్కడ ఇంజక్షన్‌ చేయరాదు. వేరే చోట చేయాలి.
కరెక్ట్‌ నీడిల్‌ లెంత్‌: సాధారణంగా ఇంజక్షన్‌ను కండరాలపై మాత్రమే ఇవ్వాలి. అయితే ఇంజక్షన్‌లో సూది పొడవు ఎక్కువగా ఉండకుండా జాగ్రతపడాలి. తక్కువ పొడవుగల సూదితోనే ఇంజక్షన్‌ చేసుకోవాలి.

logo