పచ్చని బతుకుకు
సాక్షీభూతం ఈ పచ్చడి కుండ
యుగాలు యుగాలు తరాలు తరాలు
ఈ పచ్చడి కుండలోనే భద్రంగా పొదిగినయ్!
సుఖ దుఃఖాల జీవన సంద్రంలోని
షడ్గుణాలను ఒరుసుకొని పోతూ
షడ్రుచుల జలదరింపులతో తొణకక
బహు నిండుగున్నది ఈ పచ్చడి కుండ
శోభకృత్ సంవత్సర మహా హర్మ్యానికి
సారం రసాలం ఇదే మరి
ప్రకృతిలోని పదార్థాలన్నీ
పట్టాదారులే పచ్చడి కుండకు
వారసత్వ జవసత్త్వాలను
గుంపు కూర్చిన ఒప్పుల గుమ్మి ఇది
జగతికి జీవధార జాతికి జీవగర్ర కూడా
పరమాణువుల సాంద్రం నిండిన
ఈ ఘటంపచ్చడి సొనలో
వెచ్చని సోయగాన్ని పొడసూపింది
పాల కడలిని చిలికిన అమృతభాండం ఇది!
పాలపుంతను వలచిన చంద్రబింబం ఇది!
భువన భవనపు భాండాగారం
సృష్టి స్థితిలయల ప్రళయ నినాదం
ఆది మధ్యాంతరముల మహా విహారం
ఇదే కదా!
పల్లె జీవన తాత్త్విక మహా నైవేద్యానికి
పట్టుగోడలు కట్టిన ఈ పచ్చడి కుండ
ఈ అవనికే ఆరోగ్యాల
ఆయుష్షును అందించింది!
ఈ ఉగాదికే ఉషోదయాల
ఉషస్సును చిందించింది !!