హామీల రద్దు.. అసత్యాల పద్దు
భట్టీయంలా భావోద్వేగరహితంగా భట్టి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా, వివిధ ప్రధాన టీవీ చానళ్ల యూట్యూబ్ స్ట్రీమింగ్ల కింద సామాన్యులు పెడుతున్న కామెంట్లను చూస్తుంటే.. రాజకీయాల్లో స్వల్పకాలంలో ఇంతగా విశ్వాసం కోల్పోయిన సర్కార్ బహుశా ఇంకొకటి ఉండదేమోనని అనిపించింది. రేవంత్ రెడ్డి సర్కార్‌కు అండగా డోలు మెడకేసుకున్న చానళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను జనమే కామెంట్ల కౌంటర్లతో ఈసడించుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
భట్టీయంలా భావోద్వేగరహితంగా భట్టి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా, వివిధ ప్రధాన టీవీ చానళ్ల యూట్యూబ్ స్ట్రీమింగ్ల కింద సామాన్యులు పెడుతున్న కామెంట్లను చూస్తుంటే.. రాజకీయాల్లో స్వల్పకాలంలో ఇంతగా విశ్వాసం కోల్పోయిన సర్కార్ బహుశా ఇంకొకటి ఉండదేమోనని అనిపించింది. రేవంత్ రెడ్డి సర్కార్‌కు అండగా డోలు మెడకేసుకున్న చానళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను జనమే కామెంట్ల కౌంటర్లతో ఈసడించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పద్దులో కేటాయింపులపై, ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజలు ఏ మాత్రం ఆసక్తి కనబరచనేలేదు. నెల్సన్ మండేలా నుంచి నెహ్రూ దాకా కొటేషన్లు వాడుకొని బడ్జెట్ ప్రసంగానికి విలువను అద్దేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం అపహాస్యం పాలైంది.
నిర్దిష్టమైన ఆర్థిక నమూనా, ప్రజల అనుభవంలో ప్రతిఫలించే గుణాత్మకమైన ప్రభుత్వ విధానం వెలుగులో రూపొందించే ఆదాయ, వ్యయాల ప్రణాళిక, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దోహదపడుతుంది. కానీ, లోతుపాతులెరుగని వాగుబోతు, పాతాళ గంగమ్మను చంచాతో తోడుతానని తొడగొట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉన్నదనే సత్యం ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను చూసినా, బడ్జెట్‌ను విశ్లేషించినా ఇట్టే అర్థమైపోతుంది. గత ప్రభుత్వంపై నిందలు, వర్తమానంలో ఖాళీ లంకె బిందెల కథ తప్ప, పద్దు పుస్తకంలో కొత్త పొద్దుపొడుపు ఎక్కడుందనీ? అనేక గండాలను ఎదుర్కొని, చరిత్ర పొడుగునా నెత్తురు, చెమట ధారపోసి ఒడ్డున పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు గుండె ధైర్యాన్ని, గెలుపు విశ్వాసాన్ని కలుగజేసేవి. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి, సకలజనుల సౌభాగ్యంతో పాటు వివక్షకు గురైన వర్గాల సత్వరాభివృద్ధే కొలమానంగా, బీఆర్ఎస్ ప్రభుత్వ వార్షిక ఆర్థిక ప్రణాళికలుండేవి. రాష్ట్ర తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక లక్ష్యాలపై శాస్త్రీయ దృక్పథంతో కేటాయింపులు ఉండేవి. కానీ, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌ను రాజకీయ కోణం దాటి, విశాల రాష్ట్ర ప్రయోజనాల పునాదిపై రూపొందించే ప్రయత్నం చేయలేకపోవడం విడ్డూరం. వెనకటికొక మతితప్పిన దానయ్య దుకాణం తెరిచి, బంగారాన్నీ బెల్లం ధరకే అమ్మకానికి పెట్టినట్టుగా ప్రగతి ప్రణాళికను అవాంఛనీయ దృక్పథంతో రూపొందించిన హస్తం సర్కార్ బుద్ధిజీవుల విమర్శలపాలైంది. మార్పు నినాదంతో, గ్యారంటీల గంపెడాశల దన్నుతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పార్టీ మ్యానిఫెస్టోను పూర్తిగా మరిచిపోయి పద్దు పుస్తకం నింపేసింది. మాటే శిలాశాసనం అనే రాచరికపు డైలాగ్‌ను మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలకులు రాబోయే నాలుగేండ్లు నిత్యం శీర్షాసనమేసినా ఇచ్చిన హామీలు అమలుచేయలేరని, ఆ జ్ఞానమే వారిలో లేదనే సంగతి 2024-25 వార్షిక బడ్జెట్ బట్టబయలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు గణాంకాల విన్యాసాలు, ఊకదంపుడు ఉపాన్యాసాల ఒరవడిలోనే బడ్జెట్లు ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో దశాబ్దకాలం పాటు ఆకాంక్షలు, ఆశయాలే పద్దు పుస్తకంలోని ప్రతి అక్షరంలో ఉట్టిపడ్డాయి. అయితే తెలంగాణకు దిష్టి తగిలిందో ఏమో గానీ, మళ్లీ కాళ్లల్లో కట్టెపెట్టే కాంగ్రెస్ సర్కార్ నెత్తిన పడ్డది. దీంతో ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో పాత దుర్దినాలను మళ్లీ అనుభవంలోకి తెచ్చినట్టుగానే, నిన్నటి బడ్జెట్లోనూ కోట శ్రీనివాసరావు సినిమాలోని కోడిని వేలాడదీసే సీన్‌నే తిరిగి పండించారు. 70 పేజీల పద్దు పుస్తకంలో సింహభాగాన్ని శాపనార్థాలు, అసత్యాలతో నింపేశారు. ప్రభుత్వ రథాన్ని పరనింద ఇంధనంతో నడిపించగలమని పాలక పార్టీ భ్రమించడం చూస్తుంటే.. పాలనా శాస్త్రంలో ఓనమాలు కూడా ఒంటబట్టించుకోలేదని అందరికీ అర్థమైపోతున్నది. అసలు ఏ కొలమానం లేని కేటాయింపులు, సర్కార్ వారి ఎగనామం ఎజెండాను బహిర్గతం చేసిన తర్వాత ఇంకా ఎవరికైనా భ్రమలుంటాయా? రాష్ట్ర అస్తిత్వం, సుస్థిరత, ఆత్మగౌరవం, భవిష్యత్తు తదితర కీలకాంశాల మాట దేవుడెరుగు.. కనీసం ఇచ్చిన గ్యారంటీల అమలుకు అవసరమైన వాస్తవ కేటాయింపులను సైతం కొండెక్కించారు. పద్దు ప్రసంగాన్ని అబద్ధాలతోనే ప్రారంభించిన ఆర్థిక మంత్రి ఉద్యోగాల కల్పనపై ఉత్తరకుమార ప్రగల్భాలు వల్లించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎలా కరివేపాకులా వాడిపడేసిందో ప్రజలందరికీ కండ్లకు కట్టినట్టుగా బడ్జెట్లో ఉద్యోగాలపై వల్లింపు కనబడుతూనే ఉన్నది కదా! హామీల అమలు కోసం నినదిస్తున్న వారిని వెక్కిరిస్తూ, కుళ్లబొడుస్తూ, కటకటాల్లోకి నెడుతూ నిరుద్యోగ యువత రుణం బాగానే తీర్చుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ కథను చెబుతూ, ఏడాదిలోపే రెండు లక్షల కొలువుల భర్తీని బురిడీ కొట్టించారు. ఇక మహాలక్ష్మీ పథకం ఎలా మహా మోసంగా మారిందో రాష్ట్రంలో ఏ మహిళను అడిగినా విడమరిచి చెబుతారు. సమయానికి రాని, బస్‌స్టాప్‌లలో ఆగని బస్సులతో ప్రయాణాన్ని దుఃఖ భరితంగా మార్చారు. గ్యాస్ సిలిండర్ స్కీం ఎంత గ్యాసో తెలియనిదెవ్వరికి? ప్రతి ఇంటి మహిళకూ రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామన్న గ్యారంటీ ఊసే లేదెందుకని? ఇక రుణమాఫీ అమలు గురించి గప్పాలు చెప్పిన విత్త మంత్రి, అమలులోని అసలు నిజాలను రైతులోకం ముందు దాచిపెట్టలేరు. 11లక్షల మందికే రుణమాఫీ హామీ అమలు చేస్తూ, కత్తెర నిబంధనలతో దాన్ని రుణ టోపీ స్కీంగా మార్చేశారు. చివరికి రైతుబంధుపై కూడా బడ్జెట్ ప్రసంగంలో విషం చిమ్మడం దారుణం. రైతు భరోసాను ఎత్తేసే ఎత్తుగడలను ఏ సిగ్గూ లేకుండా సభ సాక్షిగా వెల్లడించారు.
ఇది సృజనాత్మకతే కాదు, సున్నితత్వం కూడా లేని పద్దు. రెవెన్యూ రాబడులు, రుణాలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లపై వివిధ చిత్రమైన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వం, అంచనాలలో మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌ను చూసిన తర్వాత కూడా మోదీ సర్కార్ నుంచి రూ.21,636.15 కోట్లు వస్తాయని పద్దులో చూపడం చెవిలో పువ్వులు పెట్టడమే కదా!
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని నమ్మించి, బడ్జెట్లో కేవలం 7.3 శాతం కేటాయింపులు చూపి కీలకమైన విద్యారంగాన్ని వంచించింది. నిరుద్యోగ భృతితో పాటు అనేక గ్యారంటీలకు పద్దులో పావలాపైస కూడా పెట్టకుండా పక్కనపడేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు అనేక ముఖ్యమైన శాఖలకు నిధుల కేటాయింపులో కోత పెట్టారు. అలాగే పద్దుల్లో ప్రగతి కొనసాగింపు కోసం కేటాయింపులు ఉండి తీరాలి. అంతేగానీ, పద్దుల్లో పట్టింపులు, పగ, ప్రతీకారాలకు చోటివ్వనేకూడదు. గత సర్కార్ల మంచి పథకాలకు నిధులు పెంచి, మరింతమంది అర్హులైన వారికి అందేలా చూసేదే ప్రజా ప్రభుత్వం అవుతుంది. కానీ, దానికి భిన్నంగా రైతు బంధు, కేసీఆర్ కిట్ తదితర అనేక కేసీఆర్ ప్రభుత్వ మానవీయ పథకాలకు పూర్తిగా నిధులు నిలిపేయడం హీన గుణ సర్కార్ వైఖరికి నిదర్శనం. పాలకులు ప్రజా ధనానికి కాపలాదారులే కానీ యజమానులు కాదనే సత్యాన్ని కేటాయింపుల కూర్పులో రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడం పాలనా క్రౌర్యానికి అద్దం పడుతున్నది.
కరోనా, పెద్దనోట్ల రద్దు, మోదీ సర్కార్ మొండిచెయ్యి, లోప భూయిష్ట జీఎస్టీ, రెపో రేట్ల దోబూచులాట.. ఇలా ఎన్నో ఆర్థిక అవాంతరాలను కేసీఆర్ సర్కార్ ఎదుర్కొని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దింది. అక్కసుతోనో, అవివేకంతోనో రేవంత్ సర్కార్ బడ్జెట్లోనూ బద్నాం గగ్గోలు పెట్టినంత మాత్రాన, చరిత్రకెక్కినవి ఏ మాత్రం కనుమరుగైపోవు. ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలుకు ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, రాష్ట్ర అస్తిత్వమే కేసీఆర్ సర్కార్‌కు కొలమానంగా ఉండింది. బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్ర భద్రత, దివ్యమైన భవితవ్యమే గత ప్రభుత్వానికి ప్రేరణగా ఉండింది. కానీ, ఊహలు ఊళ్లేలుతుంటే, కాళ్లు గడప కూడా దాటడం లేదన్నట్టుగా రేవంత్ సర్కార్ బడ్జెట్లోనూ ఆర్భాటం చేసింది. పైన పటారం లోన లొటారం తప్ప భట్టి అప్పజెప్పిన బడ్జెట్లో ఏమీ లేదు. పదేండ్ల నిర్విరామ శ్రమతో నిర్మించుకున్న తెలంగాణ ప్రగతి చరిత్రపై బుల్డోజర్ బడ్జెట్‌గా రేవంత్ సర్కార్ పద్దున్నది. యూట్యూబ్‌లో ఒక ప్రధాన టీవీ చానల్లో బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగా.. పురుషోత్తం అనే యూజర్ ‘నాలుగేండ్లు ఎంత త్వరగా ముగిస్తే, తెలంగాణకు అంత మంచిది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమొస్తుంద’ని కామెంట్ పెట్టారు. అంతేగా.. నిజమిదేగా..! అందరినోట అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని అనిపించుకుంటున్నది కాంగ్రెస్ సర్కార్.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

