సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా!
అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా!
దాశరథి రచించిన ఈ పాట భక్తులకు భగవంతుని పట్ల మరింత భక్తిని కలిగించింది. ఎంతోమంది నిరాశాపరులను ఉత్సాహపరిచింది. నిరుపేద విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారిని ప్రయోజకులను చేసింది. చదువుకు పేదరికం అడ్డంకి కాదని, అవరోధాలను అవకాశాలుగా మార్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా స్ఫూర్తినిచ్చింది. ఈ చదువులు మనకెందుకులే అనుకున్న నిరుపేద విద్యార్థుల మదిలో చదువాలనే ఆశను రేకెత్తించింది. వారి ప్రతిభను ఖండాంతర ఖ్యాతి గడించేలా చేసింది. పల్లె వాసులను పట్నం వైపు వెళ్లేలా ప్రభావితం చేసింది. పల్లెటూరి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది.
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ!
అన్నట్టుగా ప్రతి మనిషికి సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం, తపన, తపస్సు ఉంటే మనిషి సాధించలేనిదేదీ లేదనడంలో సందేహం లేదు. ప్రతి మనిషి జీవితంలో అవరోధాలు, ఆటంకాలు సహజమే కానీ వాటిని అవకాశాలుగా మలచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన ఉస్మానియాలో వికసించిన పేదింటి విద్యా కుసుమం రవీందర్ రేనా.
రవీందర్ రేనా కరీంనగర్ జిల్లా, ఎర్రబెల్లి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబానికి చెందిన తెలంగాణ బిడ్డ. చంద్రమౌళి, రాజమ్మ దంపతులకు 1969, సెప్టెంబర్ 18న జన్మించారు. 1975 నాటి కాలంలో ఎర్రబెల్లి గ్రామం ఎలాంటి సౌకర్యాలు నోచుకోని పల్లె. కనీసం బస్సు, కరెంటు, తాగునీరు సౌకర్యం లేని గ్రామం. ఎర్రబెల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 1వ నుంచి 7వ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. చిన్న చిన్న పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తిచేశారు. ఆయన ప్రతిభకు పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ రావడం విశేషం. ఎం.ఫిల్. ఎకనామిక్స్‌లో ఎం.ఏ., వరంగల్‌లోని కేయూ నుంచి ఎల్ఎల్బీ, తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తిచేశారు.
సర్కార్ బడి నుంచి అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఎదిగిన తెలంగాణ వ్యక్తి, స్నేహశీలి, మృదుస్వభావి, విద్యావేత్త, అనన్య ప్రతిభ కలిగిన రచయిత, సంపాదకుడు, సలహాదారు, బహుభాషా కోవిదుడు రవీందర్ రేనా. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని స్వయం కృషితో అసామాన్య విద్యావేత్తగా, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాలో 31 ఏండ్లకు పైగా బోధన, పరిశోధన రంగంలో రాణించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆయా దేశాలు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. రవీందర్ రేనా ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం: 1995లో ఉస్మానియాలో చదువుతున్న సమయంలో బీసీల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని విద్యార్థి నాయకుడిగా రవీందర్ రేనా పోరాడారు. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థులు పెద్దసంఖ్యలో ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని పీవీతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని రవీందర్ రేనా తన వాదనలు వినిపంచారు.
ఉన్నత చదువులు చదివి, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఆయనది ఒదిగి ఉండే తత్వం. మూర్తీభవించిన మానవత్వానికి మరో పేరు రవీందర్ రేనా. పలు దేశాల్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ స్వదేశంపై మమకారంతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా శ్రీశ్రీ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా, న్యూఢిల్లీలోని స్పర్శ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తన కొడుకు, కుమార్తెను స్వదేశంలోనే చదివిస్తుండటం స్వదేశంపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తున్నది. బోధన, పరిశోధనలో ఆయనకు 31 ఏండ్ల అనుభవం ఉంది. 26 ఏండ్లుగా ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి వేదికలపై పలు సామాజిక, ఆర్థిక సమస్యలపై విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. 42 కంటే ఎక్కువ దేశాలు సందర్శించారు. ఎరిట్రియా, పాపువా న్యూగినియా, నమీబియా, దక్షిణాఫ్రికా, రష్యా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో పనిచేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీందర్ రానే జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శం.
ఆశయ సాధనకు పేదరికం అడ్డు కాదు, ప్రతి విద్యార్థి తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకునే దిశగా పట్టుసడలని ప్రయత్నం చేస్తూ సాధించేవరకు శ్రమించాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. అసాధ్యమనే పదంలో అ అనే అక్షరాన్ని పక్కనపెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధ్యమే. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం. సమస్యలు వచ్చాయని సతమతవకుండా అవరోధాలన్నింటినీ అవకాశాలుగా మలచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని పలు అంతర్జాతీయ సదస్సుల్లో యువతకు రవీందర్ రానే సందేశాన్నివ్వడం ఆహ్వానించదగిన పరిణామం.
కోట దామోదర్
9391480475