Nagarjuna | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కూడా భాగమవుతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మాస్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందనే సంకేతాలను ఈ గ్లింప్స్ ఇచ్చింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఐశ్వర్య రాజేష్ ‘కింగ్ 100’లో నటిస్తున్నారనే వార్త గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్ స్వయంగా ‘కింగ్ 100’ గ్లింప్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఆమె ఈ సినిమాలో భాగమన్న విషయం స్పష్టమైంది. దీంతో నాగార్జునతో ఐశ్వర్య రాజేష్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమిటి? నాగార్జునతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది? హీరోయిన్గా కనిపిస్తారా లేక కథలో కీలకమైన మరో పాత్ర పోషిస్తారా? అన్న విషయాలపై మాత్రం మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆమె పాత్రను పూర్తిగా సీక్రెట్‌గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నాగార్జున–టబు కాంబినేషన్ గతంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సుస్మితా భట్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కింగ్ 100’కు సంగీతం అందిస్తున్నది రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. నాగార్జున–డీఎస్పీ కాంబినేషన్లో గతంలో వచ్చిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈ మైల్స్టోన్ మూవీకి ఆయన ఎలాంటి ఆల్బమ్ అందిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్‌కు వచ్చే స్పందనతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కింగ్ 100’ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.